గంటల ప్రార్థనలు

ప్రస్తుత గంట

సాయంత్ర ప్రార్థన – పదకొండవ ఘడియ (వెస్పర్స్)

సూర్యాస్తమయంలో దేవుని రక్షణకు కృతజ్ఞతలు తెలుపుతూ, ఆయన కరుణపై ఆశతో మా పాపాలను ఒప్పుకుంటాము.

ప్రతి గంటకు ముందుమాట

తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ నామమున

ఏకైక దేవుడు. ఆమేన్.

ప్రభువా, కరుణించుము. ప్రభువా, కరుణించుము. ప్రభువా, ఆశీర్వదించుము. ఆమేన్.

తండ్రికి, కుమారునికి, పరిశుద్ధాత్మకును మహిమ ఇప్పుడు, ఎల్లప్పుడును, యుగయుగాల యుగములవరకు. ఆమేన్.

ప్రభు ప్రార్థన

‹కాబట్టి మీరు ఇలా ప్రార్థన చేయండి.› ‹“పరలోకంలో ఉన్న మా తండ్రీ, నీ నామం పవిత్రంగా ఉండు గాక.›

‹నీ రాజ్యం వస్తుంది గాక.› ‹పరలోకంలో నీ ఇష్టం ఎలా నెరవేరుతున్నదో అలాగే భూమి మీద కూడా నెరవేరు గాక.›

‹మా అనుదిన ఆహారం ఈ రోజు మాకు దయచెయ్యి.›

‹మాకు రుణపడి ఉన్న వారిని మేము క్షమించినట్టు మా రుణాలు క్షమించు.›

‹మేము పరీక్షల పాలు కాకుండా దుష్టుని నుండి తప్పించు.”›

కృతజ్ఞతా ప్రార్థన

మంచి కార్యముల నియంతయైన కరుణామయుడగు దేవునికి, మన ప్రభువును దేవునును రక్షకుడునైన యేసు క్రీస్తు తండ్రికి, మనము కృతజ్ఞతాస్తుతులు సాగిద్దము; ఎందుకనగా ఆయన మనలను కప్పెను, సహాయపడ్డాడు, కాపాడెను, తనవద్దకు అంగీకరించెను, మనమీద కనికరించెను, ఆశ్రయమిచ్చెను, ఈ గడియకు మమ్మును చేర్చెను. ఇదే యేలా, ఈ పరిశుద్ధ దినమునను, మన జీవమునందలి సమస్త దినములను కూడా సంపూర్ణ సమాధానముతో కాపాడుమని ఆయనను మనము ప్రార్థించుదము. సర్వాధికారియగు ప్రభువైన మన దేవుడు.

ఓ ప్రభువైన దేవా, సర్వాధికారియగు వాడా, మన ప్రభువును దేవునును రక్షకుడునైన యేసు క్రీస్తు తండ్రియగు వాడా, సమస్త కాలమందు, సమస్త విషయములను గూర్చి, సమస్త పరిస్థితులయందు నీకు కృతజ్ఞతాస్తుతులు చేసుచున్నాము; ఎందుకనగా నీవు మనలను కప్పితివి, సహాయపడియున్నావు, కాపాడితివి, నీవద్దకు అంగీకరించితివి, మనమీద కనికరించితివి, ఆశ్రయమిచ్చితివి, ఈ గడియకు మమ్మును చేర్చితివి.

ఈ కారణముచేత, మానవులను ప్రేమించువాడా, నీ సౌమ్యతయొద్దనుండి మేము అడిగి వేడుకొనుచున్నాము: నీ భయముతో కూడి ఈ పరిశుద్ధ దినమును, మన జీవితములోని సమస్త దినములను కూడా సంపూర్ణ సమాధానముతో పూర్తిచేయుటకు మాకు అనుగ్రహించుము. ప్రతి ఈర్ష్యనూ, ప్రతి శోధననూ, సాతాను యొక్క ప్రతి క్రియనూ, దుష్టుల కుట్రలనూ, ప్రత్యక్షముగానూ గోప్యముగానూ లేచిన శత్రువులనూ, మాకును నీ సమస్త ప్రజలపైనా, ఈ నీ పరిశుద్ధ స్థలంపైనా దూరముచేయుము. శ్రేయస్కరముగాను ఉపయుక్తముగాను ఉన్నదానన్నిటిని మాకు ప్రసాదించుము. ఏలయనగా శత్రువు యొక్క సమస్త శక్తిమీదను, సర్పములను విచ్చుచులను తొక్కుటకు అధికారమును నీవే మాకు అనుగ్రహించితివి. మమ్మును శోధనలో పడనియ్యక, దుష్టుని నుండి విమోచించుము.

నీ ఏకైక కుమారుడగు మన ప్రభువును దేవునును రక్షకుడునైన యేసు క్రీస్తు యొక్క కృపచేతను, కరుణలచేతను, మానవులపై ప్రేమచేతను. ఆయనద్వారానే నీకు తగిన మహిమ, గౌరవము, బలము, ఆరాధన, ఆయనతోకూడ ప్రాణదాయకుడైన సమశక్తిగల పరిశుద్ధాత్మతో కలిసి, ఇప్పుడు, ఎల్లప్పుడును, యుగయుగాల యుగములవరకు చెల్లును. ఆమేన్.

కీర్తన 50

శక్తిశాలి, దేవుడు అయిన యెహోవా ఆదేశిస్తున్నాడు. పొద్దు పొడిచే దిశ నుండి పొద్దు గుంకే దిశ వరకూ ఉన్న ప్రజలందర్నీ రమ్మని పిలుస్తున్నాడు.

పరిపూర్ణ సౌందర్యం అయిన సీయోనులో నుండి దేవుడు ప్రకాశిస్తున్నాడు.

మన దేవుడు వస్తున్నాడు. ఆయన మౌనంగా ఉండడు. ఆయనకు ముందుగా భీకర అగ్ని కబళించుకుంటూ వెళ్తుంది. ఆయన చుట్టూ ప్రచండ గాలులు వీస్తున్నాయి.

తన ప్రజలకు న్యాయం తీర్చడానికి ఆయన ఆకాశాలనూ భూమినీ పిలుస్తున్నాడు.

బలి అర్పణ ద్వారా నాతో నిబంధన చేసుకున్న నా విశ్వాస పాత్రులను నా దగ్గరకు సమకూర్చండి అని పిలుస్తున్నాడు.

ఆకాశాలు ఆయన నీతిని ప్రకటిస్తున్నాయి. ఎందుకంటే దేవుడు తానే న్యాయాధిపతిగా ఉన్నాడు.

నా ప్రజలారా, వినండి. నేను మాట్లాడతాను. నేను దేవుణ్ణి. మీ దేవుణ్ణి.

నీ బలుల విషయమై నేను నిన్ను నిందించడం లేదు. మీ దహనబలులు ఎప్పుడూ నా ఎదుటే ఉన్నాయి.

నీ ఇంటి నుండి ఎద్దునైనా, నీ మందలోని మేకపోతులనైనా నేను తీసుకోను.

ఎందుకంటే అడవిలో ఉన్న ప్రతి మృగమూ నాదే. వెయ్యి కొండలపై తిరుగాడే పశువులన్నీ నావే.

కొండల్లోని పక్షులన్నీ నాకు తెలుసు. పొలాల్లోని మృగాలు నా వశమే.

నాకు ఒకవేళ ఆకలివేస్తే అది నీకు చెప్పను. ఎందుకంటే ఈ ప్రపంచమంతా నాదే. భూమిలో ఉండేదంతా నాదే.

ఎద్దుల మాంసం నేను తింటానా? మేకల రక్తం తాగుతానా?

దేవునికి నీ కృతజ్ఞతార్పణ సమర్పించు. మహోన్నతుడికి నీ ప్రమాణాలను నెరవేర్చు.

సమస్యలు చుట్టుముట్టిన రోజున నాకు ప్రార్థించు. నేను నిన్ను కాపాడతాను. నువ్వు నన్ను కీర్తిస్తావు.

కానీ దుర్మార్గులతో దేవుడు ఇలా అంటున్నాడు. నా నియమాలను ప్రకటించడానికి నీకేం పని? నా నిబంధన నీ నోట పలకాల్సిన అవసరం ఏమిటి?

ఆదేశాలను నువ్వు అసహ్యించుకుంటావు. నా మాటలు పట్టించుకోకుండా తోసివేస్తావు.

నువ్వు దొంగను చూసి వాడితో ఏకీభవిస్తావు. వ్యభిచారం చేసే వాళ్ళతో కలుస్తావు.

ఎవరికైనా అపకారం తలపెట్టడానికి నోరు తెరుస్తావు. నీ నాలుక వంచన చేస్తుంది.

కూర్చుని నీ సోదరుడికి వ్యతిరేకంగా మాట్లాడుతావు. నీ స్వంత సోదరుడిపై అపనిందలు మోపుతావు.

నువ్వు ఇలాంటి పనులు చేస్తున్నా నేను మౌనంగానే ఉన్నాను. దాంతో నన్ను నీతో సమానంగా జమ కట్టావు. కానీ నేను నువ్వు చేసిన పనులన్నిటినీ నీ కళ్ళ ఎదుటికి తీసుకువస్తాను. నిన్ను గద్దిస్తాను.

దేవుణ్ణి మర్చిపోయే వాళ్ళు ఈ సంగతి ఆలోచించండి. లేదా నేను మిమ్మల్ని ముక్కలుగా చీల్చి వేస్తాను. మీకు సహాయం చేయడానికి ఎవరూ రారు.

కృతజ్ఞతార్పణ అర్పించే వాడు నన్ను స్తుతిస్తున్నాడు. తన ప్రయాణం సరైన మార్గంలో చేయాలని ఆలోచించే వాళ్లకు నేను దేవుని ముక్తిని చూపిస్తాను.

ప్రార్థన ఆరంభము

ఈ ధన్యమైన సాయంత్రపు స్తోత్రగీతమును నా రాజు దేవుడైన క్రీస్తుకి అర్పించుచున్నాను; నా పాపములను ఆయన క్షమించునని నన్ను వేడుకొనుచున్నాను.

కీర్తన 116

యెహోవా నా మొర, నా విన్నపాలు ఆలకించాడు. నేనాయన్ని ప్రేమిస్తున్నాను.

ఆయన నా మాటలు శ్రద్ధగా విన్నాడు. కాబట్టి నా జీవితకాలమంతా నేనాయనకు మొర్ర పెడతాను.

మరణబంధాలు నన్ను చుట్టుకున్నాయి. పాతాళ వేదనలు నన్ను పట్టుకున్నాయి. బాధ, దుఃఖం నాకు కలిగింది.

అప్పుడు యెహోవా, దయచేసి నా ప్రాణాన్ని విడిపించమని యెహోవా నామాన్నిబట్టి నేను మొర్రపెట్టాను.

యెహోవా దయాళుడు, నీతిపరుడు. మన దేవుడు వాత్సల్యం గలవాడు.

యెహోవా సాధుజీవులను కాపాడేవాడు. నేను క్రుంగి ఉన్నప్పుడు ఆయన నన్ను రక్షించాడు.

నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమం విస్తరింపజేశాడు. తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశించు.

మరణం నుండి నా ప్రాణాన్ని, కన్నీళ్లు కార్చకుండా నా కళ్ళను, జారిపడకుండా నా పాదాలను నువ్వు తప్పించావు.

సజీవులున్న దేశాల్లో యెహోవా సన్నిధిలో నేను కాలం గడుపుతాను.

నేను అలా మాట్లాడి నమ్మకం ఉంచాను. నేను చాలా బాధపడిన వాణ్ణి.

నేను తొందరపడి ఏ మనిషీ నమ్మదగినవాడు కాదు, అనుకున్నాను.

యెహోవా నాకు చేసిన ఉపకారాలన్నిటికీ నేనాయనకేమి చెల్లిస్తాను?

రక్షణపాత్రను ఎత్తి పట్టుకుని యెహోవా నామంలో ప్రార్థన చేస్తాను.

యెహోవాకు నా మొక్కుబళ్లు చెల్లిస్తాను. ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లిస్తాను.

యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువ గలది.

యెహోవా, నేను నిజంగా నీ సేవకుణ్ణి. నీ సేవకుణ్ణి, నీ సేవకురాలి కుమారుణ్ణి. నీవు నా కట్లు విప్పావు.

నేను నీకు కృతజ్ఞత అర్పణలు అర్పిస్తాను. యెహోవా నామంలో ప్రార్థన చేస్తాను

ఆయన ప్రజలందరి ఎదుటా యెహోవాకు నా మొక్కుబడులు తీరుస్తాను.

యెహోవా మందిర ఆవరణాల్లో, యెరూషలేమా, నీ మధ్యనే నేను యెహోవాకు నా మొక్కుబడులు చెల్లిస్తాను. యెహోవాను స్తుతించండి.

కీర్తన 117

యెహోవాను స్తుతించండి. జాతులారా, సర్వప్రజానీకమా, ఆయనను కొనియాడండి.

ఎందుకంటే ఆయన నిబంధన విశ్వాస్యత మన పట్ల అధికంగా ఉంది. ఆయన నమ్మకత్వం నిరంతరం నిలిచే ఉంటుంది. యెహోవాను స్తుతించండి.

కీర్తన 119

ఎవరి మార్గాలు నిష్కల్మషంగా ఉంటాయో ఎవరు యెహోవా ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకుంటారో వారు ధన్యులు.

ఆయన పవిత్ర శాసనాలను పాటిస్తూ పూర్ణహృదయంతో ఆయన్ని వెదికేవారు ధన్యులు.

వారు ఆయన బాటలో నడుస్తూ ఏ తప్పూ చేయరు.

మేము నీ ఆజ్ఞలను జాగ్రత్తగా పాటించాలని, వాటికి కట్టుబడాలని నీవు మాకు ఆజ్ఞాపించావు.

ఆహా, నేను నీ చట్టాల ప్రకారం ప్రవర్తించేలా నా ప్రవర్తన స్థిరం అయితే ఎంత మంచిది!

నీ ఆజ్ఞలన్నిటినీ నేను శిరసావహిస్తే నాకు అవమానం కలగదు.

నీ న్యాయచట్టాలను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను.

నీ కట్టడలను నేను పాటిస్తాను. నన్ను ఒంటరిగా విడిచిపెట్టవద్దు.

యువత దేనిమూలంగా తమ మార్గం పవిత్రంగా ఉంచుకోగలరు? నీ వాక్కుకు లోబడడం మూలంగానే గదా?

నా పూర్ణహృదయంతో నిన్ను వెదికాను. నన్ను నీ ఆజ్ఞలను విడిచి ఎటో వెళ్ళిపోనియ్యకు.

నీకు వ్యతిరేకంగా నేను పాపం చేయకుండేలా నా హృదయంలో నీ వాక్కును పదిలపరచుకున్నాను.

యెహోవా, నీవే ఆరాధ్య దైవం. నీ నియమాలను నాకు బోధించు.

నీవు వెల్లడి చేసిన న్యాయవిధులన్నిటినీ నా నోటితో వివరిస్తాను.

సంపదలన్నిటి కంటే పైగా నీ నిబంధన శాసనాల దారిని బట్టి నేను ఉప్పొంగిపోతున్నాను.

నీ ఆజ్ఞలను నేను ధ్యానిస్తాను. నీ మార్గాలపై మనస్సు ఉంచుతాను.

నీ కట్టడలను బట్టి నేను హర్షిస్తాను. నీ వాక్కును విస్మరించను.

నీ సేవకుణ్ణి దయ చూడు. అప్పుడు నేను సజీవంగా ఉండి నీ వాక్కు పాటిస్తాను.

నేను నీ ధర్మశాస్త్రంలోని అద్భుతమైన విషయాలు చూడగలిగేలా నా కళ్ళు తెరువు.

నేను భూమి మీద పరదేశిని. నీ ఆజ్ఞలను నాకు కనిపించకుండా దాచకు.

అస్తమానం నీ న్యాయవిధులను తెలుసుకోవాలనే ఆశతో నా ప్రాణం నీరసించిపోతోంది.

గర్విష్ఠులను నువ్వు గద్దిస్తున్నావు. వారు నీ ఆజ్ఞలను విడిచి తిరుగులాడే శాపగ్రస్తులు.

నేను నీ నిబంధన శాసనాలకు లోబడిన వాణ్ణి. నన్ను అప్రదిష్ట, అవమానాల పాలు చెయ్య వద్దు.

పాలకులు నాకు విరోధంగా కుట్ర పన్ని అపనిందలు వేసినా నీ సేవకుడు మాత్రం నీ కట్టడలను ధ్యానిస్తూనే ఉంటాడు.

నీ శాసనాలు నాకు సంతోషదాయకం. అవి నాకు ఆలోచనకర్తలు.

నా ప్రాణం మట్టి కరిచింది. నీ వాక్కుతో నన్ను బతికించు.

నా ప్రవర్తనంతా నీకు చెప్పుకున్నాను. నాకు జవాబిచ్చావు. నీ కట్టడలను నాకు బోధించు.

నీ ఉపదేశమార్గం నాకు బోధపరచు. అప్పుడు నీ దివ్యోపదేశాన్ని నేను నెమరు వేసుకుంటాను.

విషాదంతో నా ప్రాణం కరిగి నీరైపోతోంది. నీ వాక్కుతో నన్ను లేపి నిలబెట్టు.

మోసపు మార్గం నా నుండి దూరం చెయ్యి. దయచేసి నాకు నీ ఉపదేశం వినిపించు.

విశ్వసనీయత మార్గం ఎంచుకున్నాను. నీ న్యాయవిధులను నేను ఎప్పుడూ నా ఎదుట పెట్టుకుని ఉన్నాను.

యెహోవా, నేను నీ శాసనాలను అంటి పెట్టుకుని ఉన్నాను. నన్ను సిగ్గుపాలు చెయ్యవద్దు.

నా హృదయాన్ని నీవు విశాలం చేస్తే నేను నీ ఆజ్ఞల మార్గంలో పరిగెత్తుతాను.

యెహోవా, నీ శాసనాలను అనుసరించడం నాకు నేర్పు. అప్పుడు నేను కడదాకా వాటిని పాటిస్తాను.

నీ ధర్మశాస్త్రం అనుసరించడానికి నాకు అవగాహన దయచెయ్యి. అప్పుడు నా పూర్ణహృదయంతో నేను దాని ప్రకారం నడుచుకుంటాను.

నీ ఆజ్ఞల జాడల్లో నన్ను నడిపించు. వాటి ప్రకారం నడుచుకోవడం నాకెంతో ఆనందం.

నా హృదయాన్ని నీ శాసనాలవైపు తిప్పు. అక్రమ లాభం నుండి నన్ను విముఖుణ్ణి చెయ్యి.

పనికిమాలిన వాటిని చూడకుండా నా కళ్ళు తిప్పివెయ్యి. నీ మార్గాల్లో నాకు ఊపిరి పొయ్యి.

నిన్ను కొలిచే వారికి నీవిచ్చిన వాగ్దానం నీ సేవకుని పట్ల నెరవేర్చు.

నీ న్యాయవిధులు మంచివి. నాకు భయం గొలుపుతున్న నా అవమానాన్ని తీసివెయ్యి.

నీ ఉపదేశాల కోసం తహతహలాడుతున్నాను. న్యాయమైన నీ విమోచన మూలంగా నన్ను సజీవంగా ఉంచు.

యెహోవా, విఫలం కాని నీ ప్రేమను నాకు అనుగ్రహించు. నీ వాగ్దానం చొప్పున నీ రక్షణ కలిగించు.

అప్పుడు నన్ను హేళన చేసే వారికి నేను జవాబు చెప్పగలుగుతాను. ఎందుకంటే నీ మాటపై నమ్మకం ఉంచాను.

నా నోటినుండి సత్య వాక్కును ఏమాత్రం తీసి వేయకు. ఎందుకంటే నేను నీ న్యాయవిధుల మీద నా ఆశ పెట్టుకున్నాను.

ఎడతెగక నిరంతరం నీ ధర్మశాస్త్రం అనుసరిస్తాను.

నేను నీ ఉపదేశాలను వెదికే వాణ్ణి గనక భద్రంగా నడుస్తాను.

సిగ్గుపడక రాజుల ఎదుట నీ పవిత్ర శాసనాలను గూర్చి నేను మాట్లాడతాను.

నీ ఆజ్ఞల్లో నేను హర్షిస్తాను. అవి నాకు అతి ప్రియం.

నాకు ఎంతో ఇష్టమైన నీ ఆజ్ఞలవైపు నా చేతులెత్తుతాను. నీ కట్టడలను నేను ధ్యానిస్తాను.

నీ సేవకుడికి నీవు దయచేసిన మాట జ్ఞాపకం చేసుకో. దానివలన నీవు నాలో ఆశాభావం రేకెత్తించావు.

నీ వాక్కు నన్ను బ్రతికించింది. నా బాధలో ఇదే నాకు ఉపశమనం కలిగిస్తున్నది.

గర్విష్ఠులు నన్ను ఇష్టం వచ్చినట్టు ఎగతాళి చేశారు. అయినా నీ ధర్మశాస్త్రాన్నుండి నేను తొలగలేదు.

యెహోవా, పూర్వకాలంనుండి ఉన్న నీ న్యాయ విధులను జ్ఞాపకం చేసుకుని నేను ఓదార్పు నొందాను.

నీ ధర్మశాస్త్రాన్ని విడిచి నడుస్తున్న భక్తిహీనులను చూస్తే నాకు పట్టరాని కోపం పుడుతున్నది.

యాత్రికుడినైన నా బసలో నీ శాసనాలే నా పాటలు.

యెహోవా, రాత్రివేళ నీ నామాన్ని స్మరణ చేస్తున్నాను నీ ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకుంటున్నాను.

నీ ఉపదేశం అనుసరించి నడుచుకుంటున్నాను. ఇదే నాకు వరంగా అనుగ్రహించావు.

యెహోవా, నీవే నా భాగం. నీ వాక్కులననుసరించి నడుచుకుంటానని నేను నిశ్చయించుకున్నాను.

కటాక్షం చూపమని నా పూర్ణహృదయంతో నిన్ను బతిమాలుకుంటున్నాను. నీవిచ్చిన మాట ప్రకారం నన్ను కరుణించు.

నా మార్గాలు నేను పరిశీలన చేశాను. నీ శాసనాలవైపు నా ముఖం తిప్పుకున్నాను.

నీ ఆజ్ఞలను పాటించడానికి నేను జాగుచేయక వేగిరపడ్డాను.

భక్తిహీనుల పాశాలు నన్ను చుట్టుకుని ఉన్నా నీ ధర్మశాస్త్రాన్ని నేను విస్మరించ లేదు.

న్యాయమైన నీ విధులనుబట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి అర్థరాత్రివేళ నేను నిద్ర లేస్తున్నాను.

నీపట్ల భయభక్తులు గలవారందరికీ, నీ ఉపదేశాలను అనుసరించే వారికీ నేను నెచ్చెలిని.

యెహోవా, భూమి నీ నిబంధన విశ్వాస్యతతో నిండి ఉంది. నీ కట్టడలను నాకు బోధించు.

యెహోవా, నీ మాట చొప్పున నీ సేవకుడికి మేలు చేశావు.

నేను నీ ఆజ్ఞలపై నమ్మిక ఉంచాను. మంచి వివేచన, మంచి జ్ఞానం నాకు నేర్చు.

బాధ కలగక మునుపు నేను దారి విడిచాను. ఇప్పుడు నీ వాక్కు ననుసరించి నడుచుకుంటున్నాను.

నీవు దయాళుడివై మేలు చేస్తున్నావు. నీ కట్టడలను నాకు బోధించు.

గర్విష్ఠులు నా మీద అబద్ధాలు అల్లుతున్నారు. అయితే పూర్ణహృదయంతో నేను నీ ఉపదేశాలను అనుసరిస్తాను.

వారి హృదయం కొవ్వెక్కి బండబారిపోయింది. నేను నీ ధర్మశాస్త్రాన్నిబట్టి ఆనందిస్తున్నాను.

బాధల పాలు కావడం నాకు మంచిదయింది. ఎందుకంటే వాటి మూలంగా నేను నీ కట్టడలను నేర్చుకున్నాను.

వేవేల వెండి బంగారు నాణాలకంటే నీ విచ్చిన ధర్మశాస్త్రం నాకు మేలు.

నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపం ఏర్పరచాయి. నేను నీ ఆజ్ఞలను నేర్చుకునేలా నాకు బుద్ధి దయ చెయ్యి.

నీ వాక్కు మీద నేను ఆశపెట్టుకున్నాను. నీపట్ల భయభక్తులు గలవారు నన్ను చూసి సంతోషిస్తారు.

యెహోవా, నీ తీర్పులు న్యాయమైనవనీ నీవు నన్ను బాధపరచింది నీ నమ్మకత్వం వల్లనే అనీ నాకు తెలుసు.

నీ సేవకుడికి నీవిచ్చిన మాట చొప్పున నీ నిబంధన విశ్వాస్యత నన్ను ఆదరించు గాక.

నీ ధర్మశాస్త్రం నాకు సంతోషదాయకం. నేను బ్రతికేలా నీ కరుణాకటాక్షాలు నాకు కలుగు గాక.

నేను నీ ఉపదేశాలను ధ్యానిస్తున్నాను. గర్విష్ఠులు నామీద అబద్ధాలాడినందుకు వారు సిగ్గుపడతారు గాక.

నీపట్ల భయభక్తులుగలవారూ నీ శాసనాలను తెలుసుకునే వారూ నా పక్షంగా ఉంటారు గాక.

నేను సిగ్గుపడకుండేలా నా హృదయం నీ కట్టడల విషయమై నిర్దోషంగా ఉండు గాక.

నీ రక్షణ కోసం నా ప్రాణం సొమ్మసిల్లిపోతున్నది. నేను నీ వాక్కు మీద ఆశపెట్టుకున్నాను.

నన్ను ఎప్పుడు ఆదరిస్తావా అని నా కళ్ళు నీవిచ్చిన మాట కోసం కనిపెట్టి క్షీణించిపోతున్నాయి.

నేను పొగ పట్టిన ద్రాక్ష తిత్తిలాగా అయిపోయాను. అయినా నీ కట్టడలను నేను మరచిపోవడం లేదు.

నీ సేవకుడి దినాలు ఎంత తగ్గిపోయాయి! నన్ను తరిమే వారికి నీవు తీర్పు తీర్చడం ఎప్పుడు?

నీ ధర్మశాస్త్రాన్ని లెక్క చెయ్యని గర్విష్ఠులు నన్ను చిక్కించుకోడానికి గుంటలు త్రవ్వారు.

నీ ఆజ్ఞలన్నీ నమ్మదగినవి. పగవారు అకారణంగా నన్ను తరుముతున్నారు. నాకు సహాయం చెయ్యి.

భూమి మీద ఉండకుండా వారు నన్ను దాదాపుగా నాశనం చేసేశారు. అయితే నీ ఉపదేశాలను నేను విడిచిపెట్టడం లేదు.

నీవు నియమించిన శాసనాన్ని నేను అనుసరించేలా నీ నిబంధన విశ్వాస్యత చేత నన్ను బ్రతికించు.

యెహోవా, నీ వాక్కు శాశ్వతం. అది పరలోకంలో సుస్థిరంగా ఉంది.

నీ విశ్వాస్యత తరతరాలు ఉంటుంది. నీవు భూమిని స్థాపించావు. అది స్థిరంగా ఉంది.

అన్నీ నీ న్యాయ నిర్ణయం చొప్పున నేటికీ స్థిరంగా ఉన్నాయి. ఎందుకంటే అవన్నీ నీకు ఊడిగం చేస్తున్నాయి.

నీ ధర్మశాస్త్రం నాకు సంతోషమియ్యక పొతే నా బాధలో నేను సమసిపోయేవాణ్ణి.

నీ ఉపదేశాలను ఎన్నటికీ మరచిపోను. ఎందుకంటే వాటి వల్లనే నీవు నన్ను ప్రాణాలతో ఉంచావు.

నీ ఉపదేశాలను నేను వెతుకుతున్నాను. నేను నీవాణ్ణి. నన్ను రక్షించు.

నన్ను సంహరించాలని భక్తిహీనులు నా కోసం పొంచి ఉన్నారు. అయితే నేను నీ శాసనాలను తలపోసుకుంటున్నాను.

సంపూర్ణతకైనా పరిమితి ఉందని నాకు తెలుసు. కానీ నీ ధర్మోపదేశానికి ఎల్లలు లేవు.

నీ ధర్మశాస్త్రం నాకెంతో ఇష్టంగా ఉంది. రోజంతా నేను దాన్ని ధ్యానిస్తున్నాను.

నీ ఆజ్ఞలు అనునిత్యం నాకు తోడుగా ఉన్నాయి. నా శత్రువులను మించిన జ్ఞానం అవి నాకు కలగజేస్తున్నాయి.

నీ శాసనాలను నేను ధ్యానిస్తున్నాను కాబట్టి నా బోధకులందరికంటే నాకు ఎక్కువ అవగాహన ఉంది.

నీ ఉపదేశాలను నేను లక్ష్యపెడుతున్నాను గనక వయోవృద్ధుల కంటే నాకు విశేషజ్ఞానం ఉంది.

నేను నీ వాక్కుననుసరించేలా దుష్టమార్గాలన్నిటిలోనుండి నా పాదాలు తొలగించుకుంటున్నాను.

నీవు నాకు బోధించావు గనక నీ న్యాయవిధులనుండి నేను తొలగక నిలిచాను.

నీ వాక్కులు నా జిహ్వకు ఎంతో మధురం. అవి నా నోటికి తేనెకంటే తియ్యగా ఉన్నాయి.

నీ ఉపదేశం మూలంగా నాకు వివేకం కలిగింది. తప్పుమార్గాలన్నీ నాకు అసహ్యమనిపించాయి.

నీ వాక్కు నా పాదాలకు దీపం, నా దారిలో వెలుగు.

నీ న్యాయవిధులను అనుసరిస్తానని నేను మాట ఇచ్చాను. దాన్ని నిలబెట్టుకుంటాను.

యెహోవా, నేను తీవ్ర బాధ అనుభవిస్తున్నాను. నీ మాట చొప్పున నన్ను బ్రతికించు.

యెహోవా, నా నోటి స్వేచ్ఛార్పణలను అంగీకరించు. నీ న్యాయవిధులను నాకు బోధించు

నా ప్రాణం ఎప్పుడూ అపాయంలో ఉంది. అయినా నీ ధర్మశాస్త్రాన్ని నేను మరిచిపోను.

నన్ను పట్టుకోడానికి భక్తిహీనులు ఉచ్చులు పన్నారు. అయినా నీ ఉపదేశాలనుండి నేను తొలగిపోవడం లేదు.

నీ శాసనాలు నాకు ఆహ్లాదకరం. అవి నాకు నిత్య వారసత్వం అని ఎంచుకుంటున్నాను.

నీ కట్టడలను పాటించడానికి నా హృదయాన్ని నేను లోబరిచాను. ఇది తుదివరకూ నిలిచే నిత్యనిర్ణయం.

రెండు ఆలోచనల మధ్య ఊగిసలాడే వారంటే నాకు అసహ్యం. నీ ధర్మశాస్త్రం నాకు ప్రీతికరం.

నా ఆశ్రయ స్థానం, నా డాలు నువ్వే. నీ వాక్కుపై నేను ఆశపెట్టుకున్నాను.

నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరిస్తాను. దుర్మార్గం జరిగించే వారంతా నా నుండి తొలిగిపొండి.

నేను బ్రతికేలా నీ మాట చొప్పున నన్ను ఆదుకో. నా ఆశ భంగమై నేను సిగ్గుపడకుండా ఉంటాను గాక.

నాకు రక్షణ కలిగేలా నీవు నన్ను ఉద్ధరించు. అప్పుడు నీ కట్టడలను నిత్యం లక్ష్యపెడతాను.

నీ కట్టడలను మీరిన వారినందరినీ నీవు త్రోసిపుచ్చుతావు. అలాటి వారంతా దగాకోరులే, నమ్మలేని వారే.

భూమిమీదనున్న భక్తిహీనులనందరినీ నీవు తెట్టువలె నాశనం చేస్తావు. కాబట్టి నీ శాసనాలు నాకు ఇష్టం.

నీ భయం వలన నా శరీరం వణికిపోతోంది. నీ న్యాయవిధులకు నేను భయపడుతున్నాను.

నేను నీతిన్యాయాలను అనుసరిస్తున్నాను. నన్ను బాధించేవారి వశంలో నన్ను విడిచిపెట్టవద్దు.

మేలు కోసం నీ సేవకుడికి హామీ ఉండు. గర్విష్ఠులు నన్ను బాధించకుందురు గాక.

నీ రక్షణ కోసం నీతి గల నీ మాట కోసం ఎదురు చూస్తూ నా కళ్ళు క్షీణించి పోతున్నాయి.

నీ కృప చొప్పున నీ సేవకుడికి మేలు చెయ్యి. నీ కట్టడలను నాకు బోధించు.

నేను నీ సేవకుణ్ణి. నీ శాసనాలను గ్రహించేలా నాకు జ్ఞానం కలగజెయ్యి

ప్రజలు నీ ధర్మశాస్త్రాన్ని నిరర్థకం చేశారు. యెహోవా తన పని చెయ్యడానికి ఇదే సమయం.

బంగారం కంటే మేలిమి బంగారం కంటే నీ ఆజ్ఞలు నాకు ఇష్టంగా ఉన్నాయి.

నీ ఉపదేశాలన్నీ యథార్థమని నేను వాటిని శిరసావహిస్తున్నాను. అబద్ధ మార్గాలన్నీ నాకు అసహ్యం.

నీ శాసనాలు ఆశ్చర్యకరమైనవి. అందుకే నేను వాటిని పాటిస్తున్నాను.

నీ వాక్కులు వెల్లడి కావడంతోనే వెలుగు ఉదయిస్తుంది. అవి తెలివిలేని వారికి తెలివినిస్తాయి.

నీ ఆజ్ఞలపట్ల తీవ్ర వాంఛ చేత నేను నోరు తెరచి వగరుస్తూ ఉన్నాను.

నీ నామాన్ని ప్రేమించేవారికి నీవు చేసే విధంగా నావైపు తిరిగి నన్ను కరుణించు.

నీ వాక్కునుబట్టి నా అడుగులు స్థిరపరచు. ఏ పాపం నన్ను ఏలనియ్యకు.

నీ ఉపదేశాలను నేను అనుసరించేలా మనుష్యుల బలాత్కారం నుండి నన్ను విడిపించు.

నీ సేవకుడి పై నీ ముఖకాంతి ప్రకాశింపనియ్యి. నీ కట్టడలను నాకు బోధించు.

ప్రజలు నీ ధర్మశాస్త్రం అనుసరించక పోవడం చూసి నేను కన్నీరుమున్నీరైపోతున్నాను.

యెహోవా, నీవు నీతిమంతుడివి. నీ న్యాయవిధులు యథార్థం.

నీతినిబట్టి, పూర్ణ విశ్వాస్యతనుబట్టి, నీ శాసనాలను నీవు నియమించావు.

నా విరోధులు నీ వాక్కులు మరచిపోతారు. అందువలన నా ఆసక్తి నన్ను తినేస్తున్నది.

నీ మాట ఎంతో స్వచ్ఛమైనది. అది నీ సేవకుడికి ప్రియమైనది.

నేను అల్పుణ్ణి. నిరాకరణకు గురి అయిన వాణ్ణి. అయినా నీ ఉపదేశాలను నేను మరువను.

నీ నీతి శాశ్వతం. నీ ధర్మశాస్త్రం కేవలం సత్యం.

బాధ, వేదన నన్ను పట్టుకున్నాయి. అయినా నీ ఆజ్ఞలు నాకు సంతోషాన్ని కలిగిస్తున్నాయి.

నీ శాసనాలు శాశ్వత నీతిగలవి. నేను బ్రతికేలా నాకు తెలివి దయచెయ్యి.

యెహోవా, హృదయపూర్వకంగా నేను మొర్ర పెడుతున్నాను. నీ కట్టడలను నేను పాటించేలా నాకు జవాబు ఇవ్వు.

నేను నీకు మొర్ర పెడుతున్నాను. నీ శాసనాల ప్రకారం నేను నడుచుకునేలా నన్ను రక్షించు.

తెల్లవారకమునుపే మొర్రపెట్టాను. నీ మాటలపై నేను ఆశపెట్టుకున్నాను

నీవిచ్చిన వాక్కును నేను ధ్యానించడానికి నాకళ్ళు రాత్రిజాములు గడవక ముందే తెరుస్తాను.

నీ కృపను బట్టి నా మొర్ర ఆలకించు. యెహోవా, నీ వాక్యవిధులనుబట్టి నన్ను బ్రతికించు.

దుష్కార్యాలు చేసే వారు, నీ ధర్మశాస్త్రాన్ని త్రోసివేసేవారు నన్ను సమీపిస్తున్నారు.

యెహోవా, నీవు దగ్గరగా ఉన్నావు. నీ ఆజ్ఞలన్నీ సత్యమైనవి.

నీ శాసనాలను నీవు శాశ్వతంగా స్థిరపరిచావు అని నేను పూర్వం నుండి వాటిమూలంగానే తెలుసుకున్నాను.

నేను నీ ధర్మశాస్త్రాన్ని మరిచిపోయేవాణ్ణి కాదు. నా బాధను గమనించి నన్ను విడిపించు.

నా పక్షంగా వ్యాజ్యెమాడి నన్ను విమోచించు. నీవిచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికించు.

భక్తిహీనులు నీ కట్టడలను వెదకడం లేదు గనక రక్షణ వారికి దూరంగా ఉంది.

యెహోవా, నీ దయాదాక్షిణ్యాలు మితిలేనివి. నీ న్యాయవిధులను బట్టి నన్ను బ్రతికించు.

నన్ను తరిమేవారు, నా విరోధులు చాలా మంది. అయినా నీ న్యాయశాసనాలనుండి నేను తొలగకుండా ఉన్నాను.

ద్రోహులను చూసి నేను అసహ్యించుకున్నాను. నీవిచ్చిన మాటను వారు లక్ష్యపెట్టరు.

యెహోవా, చిత్తగించు. నీ ఉపదేశాలు నాకెంతో ప్రీతికరం. నీ కృపచొప్పున నన్ను బ్రతికించు.

నీ వాక్య సారాంశం సత్యం. నీవు నియమించిన న్యాయవిధులన్నీ నిత్యం నిలిచే ఉంటాయి.

అధికారులు వట్టి పుణ్యానికి నన్ను తరుముతారు. అయినా నీ వాక్యభయం నా హృదయంలో నిలిచి ఉంది.

పుష్కలంగా దోపుడుసొమ్ము సంపాదించిన వాడిలాగా నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషిస్తున్నాను.

అబద్ధం నాకు అసహ్యం. నీ ధర్మశాస్త్రం నాకు ప్రీతికరం.

నీ న్యాయవిధులనుబట్టి రోజుకు ఏడు సార్లు నేను నిన్ను స్తుతిస్తున్నాను.

నీ ధర్మశాస్త్రాన్ని ప్రేమించేవారికి ఎంతో నెమ్మది ఉంది. వారు తూలి తొట్రిల్లే కారణం ఏమీ లేదు

యెహోవా, నీ రక్షణ కోసం నేను కనిపెడుతున్నాను. నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటున్నాను.

నేను నీ శాసనాలనుబట్టి ప్రవర్తిస్తున్నాను. అవి నాకు ఎంతో ఇష్టం.

నా మార్గాలన్నీ నీ ఎదురుగా ఉన్నాయి. నీ ఉపదేశాలను నీ శాసనాలను నేను అనుసరిస్తున్నాను.

యెహోవా, నా మొర్ర నీ సన్నిధికి వస్తుంది గాక. నీ మాట చొప్పున నాకు వివేకం దయచెయ్యి.

నా విన్నపం నీ సన్నిధిని చేరనియ్యి. నీవిచ్చిన మాట చొప్పున నన్ను విడిపించు.

నీవు నీ కట్టడలను నాకు బోధిస్తున్నావు. నా పెదాలు నీ స్తోత్రం పలుకుతాయి.

నీ ఆజ్ఞలన్నీ న్యాయం. నీ వాక్కును గూర్చి నా నాలుక గానం చేస్తుంది.

నేను నీ ఉపదేశాలను కోరుకున్నాను. నీ చెయ్యి నాకు సహాయమగు గాక.

యెహోవా, నీ రక్షణ కోసం నేను ఎంతో ఆశపడుతున్నాను. నీ ధర్మశాస్త్రం నాకు సంతోషకరం.

నీవు నన్ను బ్రతికించు. నేను నిన్ను స్తుతిస్తాను. నీ న్యాయవిధులు నాకు సహాయాలగు గాక

తప్పిపోయిన గొర్రెలాగా నేను దారి తప్పి తిరిగాను. నీ సేవకుణ్ణి వెతికి పట్టుకో. ఎందుకంటే నేను నీ ఆజ్ఞలను విస్మరించేవాణ్ణి కాను.

కీర్తన 120

నా దీన స్థితిలో నేను యెహోవాను వేడుకున్నాను. ఆయన నా మొర ఆలకించాడు.

యెహోవా, అబద్ధాలు పలికే పెదాల నుండి, మోసకరమైన నాలుక నుండి నన్ను కాపాడు.

మోసకరమైన నాలుకా, ఆయన నీకేం చేస్తాడో, ఎలాంటి కీడు కలిగిస్తాడో తెలుసా?

తంగేడు నిప్పుల వంటి బాణాలు, శూరులు ఎక్కుపెట్టిన పదునైన బాణాలు ఆయన నీ మీదికి వదులుతాడు.

అయ్యో, నేను మెషెకు ప్రజల వద్ద విదేశీయునిగా ఉన్నాను. కేదారు గుడారాల దగ్గర నివసిస్తున్నాను.

విరోధుల మధ్య నేను చాలాకాలం నుండి నివసిస్తున్నాను.

నాకు కావలసింది శాంతి సమాధానాలే. అయినా నా నోటి వెంట మాట రాగానే వాళ్ళు నాతో యుద్ధానికి సిద్ధమవుతారు.

కీర్తన 121

కొండల వైపు నా కన్నులు ఎత్తి చూస్తున్నాను. నాకు సహాయం ఎక్కడనుండి వస్తుంది?

యెహోవాయే నాకు సహాయం చేస్తాడు. భూమిని, ఆకాశాలను సృష్టించింది ఆయనే.

ఆయన నీ పాదాలను జారనియ్యడు. నిన్ను కాపాడేవాడు కునికిపాట్లు పడదు.

ఇశ్రాయేలు ప్రజల సంరక్షకుడు కునికిపాట్లు పడడు, నిద్రపోడు.

నిన్ను కాపాడేవాడు యెహోవాయే. నీ కుడి పక్కన యెహోవా నీకు తోడూనీడా.

పగలు సూర్యుడు గానీ రాత్రి చంద్రుడు గానీ నీకు హాని చెయ్యరు.

ఎలాంటి ప్రమాదం జరగకుండా యెహోవా నిన్ను కాపాడతాడు. నీ ప్రాణాన్ని కాపాడేది ఆయనే.

ఇకనుండి అన్ని వేళలా నువ్వు చేసే వాటన్నిటిలో యెహోవా నిన్ను కాపాడతాడు.

కీర్తన 122

పదండి, యెహోవా మందిరానికి వెళ్దాం, అని ప్రజలు నాతో చెప్పినప్పుడు నేను సంతోషించాను.

యెరూషలేమా, మా పాదాలు నీ ప్రవేశ ద్వారాల వద్ద నిలబడుతున్నాయి.

యెరూషలేమును కుదురైన నగరంగా కట్టారు.

యెహోవా నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి యెహోవా గోత్రాలు అక్కడికి ఎక్కిపోవాలని వారికి శాసనం ఉంది.

నాయకులు అక్కడ సింహాసనాలపై కూర్చుంటారు. అవి దావీదు రాజవంశం సింహాసనాలు.

యెరూషలేము క్షేమంగా ఉండాలని ప్రార్థన చేయండి. యెరూషలేమా, నిన్ను ప్రేమించేవాళ్ళు వృద్ది చెందుతారు.

నీ సరిహద్దులు ప్రశాంతంగా ఉండాలి. నీ పట్టణాల్లో శాంతి వర్ధిల్లుతూ ఉండాలి.

మీకు శాంతి సమాధానాలు కలుగుతాయి, అని నా సహోదరులను, నా స్నేహితులను దీవిస్తాను.

మన దేవుడైన యెహోవా మందిరం కోసం, నీకు మేలు కలగడం కోసం ప్రార్థన చేస్తాను.

కీర్తన 123

పరలోకంలో సింహాసనంపై ఆసీనుడై ఉన్నవాడా, నా కన్నులెత్తి నీ వైపు చూస్తున్నాను.

సేవకుల కళ్ళు తమ యజమాని చేతి వైపు, దాసి కళ్ళు తన యజమానురాలి చేతి వైపు చూస్తాయి. అలాగే దేవుడైన యెహోవా మనపై కరుణ చూపించేదాకా మన కళ్ళు ఆయనవైపు చూస్తున్నాయి.

యెహోవా, మమ్మల్ని కరుణించు, మమ్మల్ని కరుణించు. మేము తీవ్ర తిరస్కారానికి గురయ్యాము.

అలగాజనం వేసే నిందలతో, గర్విష్ఠుల తిరస్కారాలతో మేము నిండిపోయాము.

కీర్తన 124

ఇశ్రాయేలు ప్రజలు ఈ విధంగా చెప్పాలి. యెహోవా మనకు తోడుగా ఉండకపోతే,

మనుషులు మన మీదికి ఎగబడినప్పుడు, యెహోవా మనకు తోడుగా ఉండకపోతే,

వాళ్ళ ఆగ్రహజ్వాలలు మనపై రగులుకున్నప్పుడు వాళ్ళు మనలను ప్రాణాలతోనే దిగమింగి ఉండేవాళ్ళు.

నీళ్ళు మనలను కొట్టుకుపోయేలా చేసి ఉండేవి. ప్రవాహాలు మనలను ముంచెత్తి ఉండేవి.

జల ప్రవాహాల పొంగు మనలను ఉక్కిరిబిక్కిరి చేసి ఉండేవి.

వారి పళ్ళు మనలను చీల్చివేయకుండా కాపాడిన యెహోవాకు స్తుతి.

వేటగాడి ఉరి నుండి పక్షి తప్పించుకొన్నట్టు మన ప్రాణం తప్పించుకుంది. ఉరి తెగిపోయింది. మనం తప్పించుకున్నాము.

భూమినీ, ఆకాశాలనూ సృష్టించిన యెహోవాయే మనకు సహాయం.

కీర్తన 125

యెహోవా మీద నమ్మకం ఉంచేవాళ్ళు సీయోను పర్వతంలాగా నిశ్చలంగా శాశ్వతంగా నిలిచి ఉంటారు.

యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్టు ఇప్పటినుండి యెహోవా తన ప్రజల చుట్టూ నిరంతరం ఉంటాడు.

నీతిమంతులు పాపం చేయకుండా ఉండేలా నీతిమంతుల వారసత్వంపై దుష్టుల రాజదండం పెత్తనం చెయ్యదు.

యెహోవా, మంచివారికి మంచి జరిగించు. యథార్థహృదయం గలవారికి శుభం కలిగించు.

తమ కుటిల మార్గాలకు తొలగిపోయిన వాళ్ళ విషయానికొస్తే ఆయన పాపం చేసేవాళ్ళను పారదోలేటప్పుడు వారిని దుర్మార్గులతో సహా వెళ్ళగొడతాడు. ఇశ్రాయేలు మీద శాంతి సమాధానాలు ఉండు గాక.

కీర్తన 126

సీయోను నగరవాసులను యెహోవా చెరలో నుండి తిరిగి రప్పించినప్పుడు మనం కల కంటున్నవాళ్ళ వలే ఉన్నాం.

మన నోరు నవ్వుతో నిండిపోయింది. మన నాలుక ఆనంద గీతాలు ఆలపిస్తుంది. అప్పుడు యెహోవా వీళ్ళ కోసం గొప్పకార్యాలు జరిగించాడు, అని అన్యజనులు చెప్పుకున్నారు.

మనకి ఎంత ఆనందం! ఎందుకంటే యెహోవా మన కోసం ఘన కార్యాలు చేశాడు.

దక్షిణ ప్రాంతపు సెలయేరులవలే యెహోవా, మా అదృష్టాన్ని తిరిగి చిగురింపజెయ్యి.

కన్నీళ్లు కారుస్తూ విత్తనాలు చల్లేవాళ్ళు కేరింతలతో పంట కోస్తారు.

విత్తనాలు చేతబట్టుకుని ఏడుస్తూ చల్లేవాడు సంబరంగా పనలు మోసుకుంటూ తిరిగి వస్తాడు.

కీర్తన 127

యెహోవా ఇల్లు కట్టించకపోతే దాన్ని కట్టే వారు పాటుబడడం వ్యర్ధం. యెహోవా పట్టణానికి కావలిగా ఉండకపోతే దాన్ని కాపలా కాసేవాళ్ళు నిలబడి ఉండడం వ్యర్ధం.

మీరు తెల్లారే లేచి చాలా ఆలస్యంగా ఇంటికి వస్తూ, కష్టపడి పని చేసి ఆహారం తింటూ ఉండడం వ్యర్ధం. దేవుడు తనకిష్టమైన వారికి నిద్రనిస్తున్నాడు.

చూడండి, పిల్లలు యెహోవా ప్రసాదించే వారసత్వం. గర్భఫలం ఆయన ఇచ్చే బహుమానం.

యవ్వన కాలంలో పుట్టిన పిల్లలు శూరుడి చేతిలోని బాణాల వంటివాళ్ళు.

వారితో తన అంబులపొది నింపుకున్న మనిషి ధన్యుడు. వాళ్ళు గుమ్మంలో తమ విరోధులను ఎదిరించి నిలబడినప్పుడు అవమానం పాలు కారు.

కీర్తన 128

యెహోవా అంటే భయభక్తులు కలిగి, ఆయన విధానాల్లో నడుచుకునే వాళ్ళు ధన్యులు.

నువ్వు కష్టపడి సంపాదించినది తప్పకుండా అనుభవిస్తావు. నీకు అంతా శుభం కలుగుతుంది, నువ్వు వర్ధిల్లుతావు.

నీ ఇంట్లో నీ భార్య ఫలవంతమైన ద్రాక్షాతీగెలాగా ఉంటుంది. నీ పిల్లలు నీ బల్ల చుట్టూ ఒలీవ మొక్కల్లాగా ఉంటారు.

యెహోవాను గౌరవించేవాడు ఈ విధంగా ఆశీర్వాదాలు పొందుతాడు.

సీయోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించు గాక. నువ్వు జీవిత కాలమంతా యెరూషలేము సుసంపన్నం కావడం చూస్తావు.

నీ మనవలు, మనవరాళ్ళను నువ్వు చూస్తావు. ఇశ్రాయేలు మీద శాంతి సమాధానాలు ఉండు గాక.

పరిశుద్ధ సువార్త లూకా వ్రాసిన ప్రకారం (4:38–41)

¶ ఆయన సమాజ మందిరం నుండి, సీమోను ఇంటికి వెళ్ళాడు. సీమోను అత్త తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ ఉంది. ఆమెను బాగు చేయాలని వారాయన్ని బతిమిలాడారు.

ఆయన ఆమె దగ్గర నిలబడి జ్వరాన్ని మందలించగానే జ్వరం ఆమెను విడిచింది. వెంటనే ఆమె లేచి వారికి సేవ చేయసాగింది.

¶ పొద్దుగుంకుతున్నపుడు అనేక రకాల జబ్బులున్న వారిని యేసు దగ్గరికి తెచ్చారు. వారిలో ప్రతి ఒక్కరి మీదా ఆయన చేతులుంచి బాగు చేశాడు.

వారిలో చాలామందిలో నుండి దయ్యాలు, “నీవు దేవుని కుమారుడివి” అని కేకలు వేస్తూ బయటికి వెళ్ళిపోయాయి. ఆయన క్రీస్తు అని వాటికి తెలుసు కాబట్టి ఆయన వాటిని గద్దించి వాటిని మాట్లాడనివ్వలేదు.

Tenoo oasht emmok o piekhristos nem pekyot en aghathos nem pi epnevma ethowab je akee ak soati emmon nai nan

ఓ క్రీస్తా, నీ మేలైన తండ్రితోను పరిశుద్ధాత్మతోను కలిసి మేము నిన్ను ఆరాధిస్తున్నాము; నీవు వచ్చి మమ్మల్ని రక్షించితివి.

1. నీతిమంతుడే కష్టపడి రక్షింపబడునెడల, పాపినైన నేను ఎక్కడ ప్రత్యక్షపడుదును? మానవ బలహీనత వలన దినపు భారమును వేడిమిని నేను భరింపలేదు. అయినను, ఓ కరుణామయుడా, నన్ను పదకొండవ ఘడియ కార్మికులతో కూడ లెక్కింపుము. ఇదిగో, దోషములలోనే నేను గర్భం ధరించబడ్డాను; పాపములలోనే నా తల్లి నన్ను కనెను. అందువలన నేను పరలోకమునకు కన్నులెత్తి చూడటానికి సాహసించలేను; అయితే నీ అపార కరుణ మీదను, నీ మనుష్యప్రేమ మీదను ఆధారపడుచూ ఇలా మొఱ్ఱపెడుతున్నాను: “దేవా, నన్ను క్షమించుము, పాపిని కరుణించుము.”

Doxa Patri ke Eioa ke Agio Pnevmati

తండ్రికి, కుమారునికి, పరిశుద్ధాత్మకు మహిమ కలుగును గాక.

2. ఓ రక్షకుడా, తండ్రి ఒడులు నాకు త్వరగా తెరచి ఇవ్వుము; ఎందుకంటే నేను నా జీవితమంతటిని సుఖాలలోను వాంఛలలోను వృథా చేసితిని, దినము నామీదుగా గడచిపోయి పోయెను. కాబట్టి ఇప్పుడు నీవు అంతములేని నీ కరుణాసంపద మీద ఆధారపడుచున్నాను. వినమ్ర హృదయముతో నీ కరుణకు అత్యవసరమైన నన్ను విడువకుము. ఎందుకనగా నేను వినయముగా ఇలా మొఱ్ఱపెడుతున్నాను: “తండ్రీ, నేను పరలోకమునకును నీకు ముందును పాపం చేసితిని; నీ కుమారుడనిపించుకొనుటకు నేను అర్హుడను కాను; నన్ను నీ కూలీలలో ఒకడిగా చేయుము.”

Ke nin ke a ee ke ees toos e onas toan e oa noan ameen.

ఇప్పుడును యుగయుగముల వరకు. ఆమేన్.

3. ప్రతి అక్రమమును నేను చాకచక్యముతో చేసితిని; ప్రతి పాపమును ఆసక్తితో శ్రద్ధతో చేసితిని; అందుచేత సమస్త శిక్షకును తీర్పునకు నేను పాత్రుడను. కాబట్టి, ఓ అమ్మ గారైన కన్యకా, నాకు పశ్చాత్తాపమునకు దారులను సిద్ధపరచుము; నీ వద్దకే నేను ఆశ్రయిస్తున్నాను; నీ ద్వారా మధ్యస్థత్వం కోరుచున్నాను; నిన్నే సహాయమునకు పిలుచుకొనుచున్నాను; నన్ను అవమానంలో పడనీయకుము. నా ఆత్మ శరీరమును విడిచిపెట్టునప్పుడు నాయొద్ద నుండుము; శత్రువుల యుక్తినాశనము చేయుము; నాశనం నోటిని మూయుము; వారు నా ఆత్మను మింగకుండునట్లు కాపాడుము; నిజమైన వరుని, నిందలేని వధువు నీవగు దేవమాతా.

తరువాత ఆరాధకుడు ఇలా ప్రార్థిస్తాడు:

ప్రభువా, మమ్మల్ని ఆలకించి మాపై కరుణ చూపి మా పాపాలను క్షమించుము. ఆమేన్.

(ప్రభువా, కరుణించుము) 41 సార్లు

అబ్సొల్యూషన్

దయామయుడగు మా రాజా, నిన్ను మేము కృతజ్ఞతగా స్తుతించుచున్నాము; ఎందుకనగా ఈ దినమును నీవు సమాధానముతో గడిపించుచు, సాయంత్రమునకు మమ్మును కృతజ్ఞులుగా చేర్చితివి; సాయంత్రపు కాంతిని దర్శించుటకు మమ్మును యోగ్యులనుగాచేసితివి. ఇప్పుడు జరిగిన మా స్తుతిని ఆలకించుము. విరోధి యొక్క మాయల నుండి మమ్మును విమోచించుము; అతడు మాకు సిద్ధపరచిన ప్రతికూటములను తొలగించుము. ఈ రాబోయే రాత్రిలో మాకు నొప్పిలేకుండా, కలవరంలేకుండా, శ్రమలేకుండా, భ్రమలు లేకుండా భద్రతను అనుగ్రహించుము; దానినీ సమాధానముతోను, స్వచ్ఛతతోను గడిపి, ప్రతిసమయమునను ప్రతీస్థలములోను స్తోత్రప్రార్థనలకు లేచుటకు మమ్మును లేపుము; ప్రతిదానిలోను నీ పరిశుద్ధ నామమును మహిమపరచుటకు మమ్మును చేయుము — గ్రహింపలేనివాడై ఆదిలేనివాడైన తండ్రితోను, సమశక్తిగల ప్రాణదాయకుడైన పరిశుద్ధాత్మతోనును కలిసి — ఇప్పుడు, ఎల్లప్పుడును, యుగయుగాల యుగములవరకు. ఆమేన్.

ప్రతి గంట ముగింపున ప్రార్థించు విన్నపము

దేవా, మమ్మీద కరుణ చూపుము; ఆ తర్వాత మరల కరుణ చూపుము. పరలోకమందును భూమిమీదను ఎల్లకాలము ఆరాధింపబడి మహిమపొందుచున్న, మన క్రీస్తు దేవుడగు సద్గుణసంపన్నుడా, దీర్ఘశాంతుడా, మహాకరుణామయుడా, మిక్కిలి సానుభూతిగలవాడా, ధర్ములను ప్రేమించువాడా, పాపులను కరుణించువాడా — అందులో ముందువాడునైన నేను — నీవు దుర్మార్గుని మరణమునకును కాక, అతడు మనస్సు మార్చుకొని బ్రదుకుటకే ఇష్టపడుచున్నావు; రానున్న మేలుల వాగ్దానమునుగూర్చి అందరినీ రక్షణకు పిలిచుచున్నావు.

ప్రభువా, ఈ గడియలోను ప్రతిగడియలోను మా విన్నపములను అంగీకరించుము. మా జీవనమును సులభపరచుము; నీ ఆజ్ఞలను చేయుటకై మమ్మును దారి చూపుము. మా ఆత్మలను పరిశుద్ధపరచుము. మా దేహములను శుద్ధపరచుము. మా ఆలోచనలను నిటారుకున్నవి చేయుము. మా సంకల్పములను నిర్మలపరచుము. మా వ్యాధులను స్వస్థపరచుము, మా పాపములను క్షమించుము. ప్రతి చెడ్డ దుఃఖము నుండియు హృదయ వేదన నుండియు మమ్మును విడిపించుము. నీ పరిశుద్ధ దూతలచేత మమ్మును చుట్టుముట్టించుము, వారి శిబిరమందు మేము కాపాడబడినవారమై, దారిచూపబడినవారమై, విశ్వాస ఏకత్వమునకు, నీ అనిర్వచనీయమైన, అశేషమైన మహిమ జ్ఞానమునకు చేరు గాక; ఏనందున నీవు యుగయుగములవరకు ధన్యుడవు. ఆమేన్.

దేవా, కృతజ్ఞతతో ఇలా అనునట్లు మమ్మును యోగ్యులుగా చేయుము: పరలోకమందున్న మా తండ్రి...