All books in తెలుగు IRV

విలాప వాక్యములు 3

తెలుగు IRV · chapter 3

5 అధ్యాయాలు

1 ¶ నేను యెహోవా ఆగ్రహదండం వల్ల బాధ అనుభవించిన వాణ్ణి.

2 ¶ ఆయన నన్ను తోలి వేసి, వెలుగులో కాకుండా చీకట్లో నడిచేలా చేశాడు.

3 ¶ నిజంగా ఆయన నా మీద తిరగబడ్డాడు. రోజంతా నన్ను శిక్షిస్తున్నాడు.

4 ¶ ఆయన నా మాంసం, నా చర్మం చీకిపోయేలా చేస్తున్నాడు, నా ఎముకలను విరగ్గొట్టాడు.

5 ¶ నాకు విరుద్ధంగా ముట్టడి కంచె నిర్మించాడు. క్రూరత్వం, కష్టం నా చుట్టూ ఉంచాడు.

6 ¶ ఎప్పుడో చనిపోయిన వాళ్ళు ఉండే చీకటి తావుల్లో నేను ఉండేలా చేశాడు.

7 ¶ ఆయన నా చుట్టూ గోడ కట్టాడు. నేను తప్పించుకోలేను. నా సంకెళ్ళు బరువుగా చేశాడు.

8 ¶ నేను కేకలు పెట్టి పిలిచినా, నా ప్రార్థనలు తోసివేశాడు.

9 ¶ ఆయన నా దారికి అడ్డంగా చెక్కుడు రాళ్ళ గోడలను ఉంచాడు. నేను ఎక్కడికి తిరిగినా నాకు దారి కనిపించలేదు.

10 ¶ నా పాలిట ఆయన పొంచి ఉన్న ఎలుగుబంటిలా ఉన్నాడు. దాగి ఉన్న సింహంలా ఉన్నాడు.

11 ¶ నాకు దారి లేకుండా చేసి నన్ను చీల్చి చెండాడి నాకు దిక్కు లేకుండా చేశాడు.

12 ¶ విల్లు ఎక్కుపెట్టి బాణానికి గురిగా ఆయన నన్ను ఎన్నుకున్నాడు.

13 ¶ తన అంబుల పొదిలోని బాణాలన్నీ ఆయన నా మూత్రపిండాల గుండా దూసుకెళ్ళేలా చేశాడు.

14 ¶ నా ప్రజలందరికీ నేను నవ్వులాటగా ఉన్నాను. ప్రతి రోజూ వాళ్ళు నా గురించి ఆక్షేపణ పాటలు పాడుతున్నారు.

15 ¶ చేదు పదార్ధాలు ఆయన నాకు తినిపించాడు. విష ద్రావకంతో నన్ను మత్తెక్కేలా చేశాడు.

16 ¶ రాళ్లతో నా పళ్ళు విరగ్గొట్టాడు. బూడిదలోకి నన్ను అణగ దొక్కాడు.

17 ¶ నా జీవితంలోనుంచి శాంతి తొలగించాడు. నాకు సంతోషం గుర్తు లేదు.

18 ¶ కాబట్టి నేను “నా శోభ అంతరించి పోయింది, యెహోవాలో నాకు ఇంక ఆశ మిగల లేదు” అనుకున్నాను.

19 ¶ నా బాధ, నా దురవస్థ, నేను తాగిన ద్రావకపు చేదు నేను గుర్తు చేసుకుంటున్నాను.

20 ¶ కచ్చితంగా నేను వాటిని గుర్తు చేసుకుని, నాలో నేను కృంగిపోయాను.

21 ¶ కాని, నేను దీన్ని గుర్తు చేసుకొన్నప్పుడు నాకు ఆశ కలుగుతూ ఉంది.

22 ¶ యెహోవా కృప గలవాడు. ఆయన నిబంధన నమ్మకత్వాన్ని బట్టి మనం ఇంకా పూర్తిగా నాశనం కాలేదు.

23 ¶ ప్రతి రోజూ మళ్ళీ కొత్తగా ఆయన దయగల చర్యలు చేస్తాడు. నీ నమ్మకత్వం ఎంతో గొప్పది!

24 ¶ “యెహోవా నా వారసత్వం” అని నా ప్రాణం ప్రకటిస్తూ ఉంది. కాబట్టి ఆయనలోనే నా నమ్మిక ఉంచుతున్నాను.

25 ¶ తన కోసం కనిపెట్టుకుని ఉండే వాళ్ళ పట్ల, ఆయనను వెదికే వాళ్ళ పట్ల యెహోవా మంచివాడు.

26 ¶ యెహోవా కలిగించే రక్షణ కోసం మౌనంగా కనిపెట్టడం మంచిది.

27 ¶ తన యవ్వనంలో కాడి మోయడం మనిషికి మంచిది.

28 ¶ అతని మీద దాన్ని మోపిన వాడు యెహోవాయే గనుక అతడు ఒంటరిగానూ, మౌనంగానూ కూర్చుని ఉండాలి.

29 ¶ ఒకవేళ నిరీక్షణ కలుగవచ్చేమో గనుక అతడు బూడిదలో తన మూతి పెట్టుకోవాలి.

30 ¶ అతడు తనను కొట్టేవాడివైపు తన చెంపను తిప్పాలి. అతడు పూర్తిగా అవమానంతో నిండి ఉండాలి.

31 ¶ ప్రభువు అతన్ని ఎల్లకాలం తృణీకరించడు.

32 ¶ ఆయన శోకం రప్పించినా, తన నిబంధన నమ్మకత్వపు గొప్పదనాన్ని బట్టి కనికరం చూపిస్తాడు.

33 ¶ హృదయపూర్వకంగా ఆయన మనుషులను పీడించడు, బాధ కలిగించడు.

34 ¶ దేశంలో బందీలుగా ఉన్నవాళ్ళందరినీ కాళ్ల కింద తొక్కడం,

35 ¶ మహోన్నతుని సన్నిధిలో మనుషులకు న్యాయం దొరకక పోవడం,

36 ¶ ఒక మనిషి హక్కును తొక్కిపెట్టడం ప్రభువు చూడడా?

37 ¶ ప్రభువు ఆజ్ఞలేకుండా, మాట ఇచ్చి దాన్ని నెరవేర్చ గలవాడెవడు?

38 ¶ మహోన్నతుడైన దేవుని నోట్లో నుంచి కీడు, మేలు రెండూ బయటకు వస్తాయి గదా?

39 ¶ బతికున్న వాళ్ళల్లో ఎవరికైనా తమ పాపాలకు శిక్ష వేస్తే మూలగడం ఎందుకు?

40 ¶ మన మార్గాలు పరిశీలించి తెలుసుకుని మనం మళ్ళీ యెహోవా వైపు తిరుగుదాం.

41 ¶ ఆకాశంలో ఉన్న దేవుని వైపు మన హృదయాన్నీ, మన చేతులను ఎత్తి ఇలా ప్రార్థన చేద్దాం.

42 ¶ మేము అతిక్రమం చేసి తిరుగుబాటు చేశాం. అందుకే నువ్వు మమ్మల్ని క్షమించలేదు.

43 ¶ నువ్వు కోపం ధరించుకుని మమ్మల్ని తరిమావు. దయ లేకుండా మమ్మల్ని వధించావు.

44 ¶ మా ప్రార్థన నీ దగ్గరికి చేరకుండా నువ్వు మేఘంతో నిన్ను నువ్వు కప్పుకొన్నావు.

45 ¶ జాతుల మధ్య మమ్మల్ని విడనాడి, పనికిరాని చెత్తగా చేశావు.

46 ¶ మా శత్రువులందరూ మమ్మల్ని చూసి నోరు తెరిచి ఎగతాళి చేశారు.

47 ¶ గుంటను గురించిన భయం, విధ్వంసం, నాశనం మా మీదకు వచ్చాయి.

48 ¶ నా ప్రజల కుమారికి కలిగిన నాశనం నేను చూసినప్పుడు నా కన్నీరు ఏరులై పారుతోంది.

49 ¶ యెహోవా దృష్టించి ఆకాశం నుంచి చూసే వరకూ,

50 ¶ నా కన్నీరు ఆగదు. అది ప్రవహిస్తూనే ఉంటుంది.

51 ¶ నా పట్టణపు ఆడపిల్లలందరినీ చూస్తూ నా కళ్ళకు తీవ్రమైన బాధ కలుగుతోంది.

52 ¶ ఒకడు పక్షిని తరిమినట్టు నా శత్రువులు అకారణంగా నన్ను కనికరం లేకుండా తరిమారు.

53 ¶ వారు నన్ను బావిలో పడేసి నా మీద రాయిని పెట్టారు.

54 ¶ నీళ్లు నా తల మీదుగా పారాయి. నేను నాశనమయ్యానని అనుకొన్నాను.

55 ¶ యెహోవా, అగాధమైన గుంటలోనుంచి నేను నీ నామాన్ని పిలిచాను.

56 ¶ సాయం కోసం నేను మొర్ర పెట్టినప్పుడు నీ చెవులు మూసుకోవద్దు అని నేనన్నప్పుడు, నువ్వు నా స్వరం ఆలకించావు.

57 ¶ నేను నీకు మొర్ర పెట్టిన రోజు నువ్వు నా దగ్గరికి వచ్చి నాతో “భయపడవద్దు” అని చెప్పావు.

58 ¶ ప్రభూ, నువ్వు నా జీవితపు వివాదాల విషయంలో వాదించి నా జీవాన్ని విమోచించావు.

59 ¶ యెహోవా, నాకు కలిగిన అణిచివేత నువ్వు చూశావు. నాకు న్యాయం తీర్చు.

60 ¶ నా మీద పగ తీర్చుకోవాలని వాళ్ళు చేసే ఆలోచనలన్నీ నీకు తెలుసు.

61 ¶ యెహోవా, వాళ్ళు నా గురించి చేసే ఆలోచనలు, వాళ్ళు పలికే దూషణ నువ్వు విన్నావు.

62 ¶ నా మీదికి లేచిన వాళ్ళు పలికే మాటలు, రోజంతా వాళ్ళు నా గురించి చేసే ఆలోచనలు నీకు తెలుసు.

63 ¶ యెహోవా, వాళ్ళు కూర్చున్నా లేచినా, వాళ్ళు ఎగతాళిగా పాడే పాటలకు నేనే గురి.

64 ¶ యెహోవా, వాళ్ళ చేతులు చేసిన పనులను బట్టి నువ్వు వాళ్లకు ప్రతీకారం చేస్తావు.

65 ¶ వాళ్ళ గుండెల్లో భయం పుట్టిస్తావు. వాళ్ళను శపిస్తావు.

66 ¶ యెహోవా, ఉగ్రతతో వాళ్ళను వెంటాడుతావు. ఆకాశం కింద ఉండకుండాా వాళ్ళను నాశనం చేస్తావు.