All books in తెలుగు IRV

సామెత 30

తెలుగు IRV · chapter 30

31 అధ్యాయాలు

తెలుగు IRV / సామెత / అధ్యాయం 30

తెలుగు IRV · chapter 30

1 ¶ ఇది దేవోక్తి. అంటే యాకె కుమారుడు ఆగూరు పలికిన మాటలు. అతడు ఈతీయేలుకు, ఉక్కాలుకు చెప్పిన మాట.

2 ¶ నిశ్చయంగా మనుషుల్లో నావంటి పశుప్రాయుడు లేడు. మనుషులకు ఉండవలసిన ఇంగితం నాకు లేదు.

3 ¶ నేను జ్ఞానాన్ని అభ్యసించలేదు. పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానం పొందలేదు.

4 ¶ ఆకాశానికెక్కి దిగివచ్చిన వాడెవడు? తన పిడికిళ్లతో గాలిని పట్టుకున్నవాడెవడు? బట్టలో నీళ్లు మూటకట్టినవాడెవడు? భూమి దిక్కులన్నిటిని స్థాపించిన వాడెవడు? ఆయన పేరుగానీ ఆయన కుమారుడి పేరుగానీ నీకు తెలుసా?

5 ¶ దేవుని మాటలన్నీ పవిత్రమైనవే. ఆయన్ని ఆశ్రయించే వారికి ఆయన డాలు.

6 ¶ ఆయన మాటలతో ఏమీ చేర్చవద్దు. ఆయన నిన్ను గద్దిస్తాడేమో. అప్పుడు నీవు అబద్ధికుడివౌతావు.

7 ¶ దేవా, నేను నీతో రెండు మనవులు చేసుకుంటున్నాను. నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహించు.

8 ¶ వ్యర్థమైన వాటిని ఆబద్ధాలను నాకు దూరం చెయ్యి. పేదరికాన్నిగానీ ఐశ్వర్యాన్ని గానీ నాకు ఇవ్వొద్దు. చాలినంత అన్నం మాత్రం పెట్టు.

9 ¶ ఎక్కువైతే నేను కడుపు నిండి నిన్ను తిరస్కరించి “యెహోవా ఎవరు?” అంటానేమో. లేదా పేదరికం వల్ల దొంగతనం చేసి నా దేవుని నామాన్ని తెగనాడతానేమో.

10 ¶ దాసుని గూర్చి వాడి యజమానితో కొండేలు చెప్పకు. వాడు నిన్ను తిట్టుకుంటాడు. ఒకవేళ నీవు శిక్షార్హుడి వౌతావు.

11 ¶ తమ తండ్రిని శాపనార్థాలు పెడుతూ, తల్లిపట్ల వాత్సల్యత చూపని తరం ఉంది.

12 ¶ తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యం శుభ్రం కానీ తరం ఉంది.

13 ¶ కళ్ళు నెత్తికి వచ్చినవారి తరం ఉంది. వారి కనురెప్పలు ఎంత పైకి వెళ్లి పోయాయో గదా!

14 ¶ దేశంలో ఉండకుండాా దరిద్రులను మింగేస్తూ మనుషుల్లో ఉండకుండాా పేదలను నశింపజేయడానికి కత్తుల్లాటి పళ్లు, పదునైన దవడ పళ్లు ఉన్న వారి తరం ఉంది.

15 ¶ జలగకు ఇవ్వు, ఇవ్వు అనే పేరున్న కూతురులిద్దరు ఉన్నారు. తృప్తిలేనివి మూడు ఉన్నాయి. చాలు అని పలకనివి నాలుగు ఉన్నాయి.

16 ¶ పాతాళం, గొడ్రాలి గర్భం, నీరు చాలు అనని భూమి, చాలు అనని అగ్ని.

17 ¶ తండ్రిని దూషిస్తూ తల్లి మాట వినని వాడి కళ్ళు లోయ కాకులు పీక్కుతింటాయి. పక్షిరాజు పిల్లలు వాటిని తింటాయి.

18 ¶ నా బుద్ధికి మించినవి మూడు ఉన్నాయి. నేను గ్రహించలేనివి నాలుగు ఉన్నాయి.

19 ¶ అవి, అంతరిక్షంలో గరుడ పక్షి జాడ, బండమీద పాము జాడ, నడిసముద్రంలో ఓడ వెళ్ళే జాడ, కన్యతో మగవాడి జాడ.

20 ¶ వ్యభిచారిణి మార్గం కూడా అలాటిదే. ఆమె తిని నోరు తుడుచుకుని నాకేం తెలియదంటుంది.

21 ¶ భూమిని వణకించేవి మూడు ఉన్నాయి, అది మోయ లేనివి నాలుగు ఉన్నాయి.

22 ¶ అవి గద్దెనెక్కిన సేవకుడు, కడుపు నిండా అన్నం ఉన్న మూర్ఖుడు,

23 పెళ్లి చేసుకున్న గయ్యాళి గంప, యజమానురాలికి హక్కు దారైన దాసి.

24 ¶ భూమి మీద చిన్నవి నాలుగు ఉన్నాయి అయినా అవి ఎంతో జ్ఞానం గలవి.

25 ¶ చీమలు బలం లేని జీవులు. అయినా అవి వేసవిలో తమ ఆహారం సిద్ధపరచుకుంటాయి.

26 ¶ చిన్న కుందేళ్లు బలం లేని జీవులు అయినా అవి బండ సందుల్లో నివాసాలు కల్పించుకుంటాయి.

27 ¶ మిడతలకు రాజు లేడు అయినా అవన్నీ బారులు తీరి సాగిపోతాయి.

28 ¶ నీవు బల్లిని చేతితో పట్టుకోగలవు. అయినా రాజ గృహాల్లో అది ఉంటుంది.

29 ¶ డంబంగా నడుచుకునేవి మూడు ఉన్నాయి. ఠీవిగా నడిచేవి నాలుగు ఉన్నాయి.

30 ¶ అవి మృగాలన్నిటిలో బలం కలిగి ఎవరికీ భయపడి వెనుదిరుగని సింహం,

31 బడాయిగా నడిచే కోడి పుంజు, మేకపోతు, తన సేనకు ముందు నడుస్తున్న రాజు.

32 ¶ నీవు బుద్ధిహీనుడవై గర్వించి ఉంటే, కీడు కలిగించే పన్నాగం పన్ని ఉంటే నీ చేత్తో నోరు మూసుకో.

33 ¶ పాలు చిలికితే వెన్న పుడుతుంది. ముక్కు పిండితే రక్తం కారుతుంది. కోపం రేపితే కలహం పుడుతుంది.