తెలుగు IRV / సామెత / అధ్యాయం 9
తెలుగు IRV · chapter 9
1 ¶ జ్ఞానం ఏడు స్తంభాలు చెక్కుకుని దానిపై తన నివాసం కట్టుకున్నది.
2 ¶ పశువులను వధించి మాంసం, ద్రాక్షారసం, భోజన పదార్థాలు సిద్ధం చేసింది.
3 ¶ తన దాసీల చేత మనుషులకు కబురంపింది. పట్టణంలోని ఉన్నత స్థలంపై నిలబడింది.
4 ¶ “జ్ఞానం లేని వాళ్ళంతా ఇక్కడికి రండి” అని పిలుస్తున్నది.
5 ¶ తెలివితక్కువ వాళ్ళతో ఇలా చెబుతుంది “రండి, వచ్చి నేను సిద్దం చేసిన ఆహారం తినండి. నేను కలిపి ఉంచిన ద్రాక్షారసం తాగండి.
6 ¶ ఇకనుంచి జ్ఞానం కలిగి జీవించండి. తెలివి కలిగించే బాటలో సవ్యంగా నడవండి.”
7 ¶ ఎగతాళి చేసేవాళ్ళకు బుద్ధి చెప్పేవాడు తన మీదకే నింద తెచ్చుకుంటాడు. దుష్టులను గద్దించే వాడికి అవమానం కలుగుతుంది.
8 ¶ ఎగతాళి చేసేవాణ్ణి గద్దించవద్దు. వాణ్ణి గద్దిస్తే ఒకవేళ వాడు నీపై ద్వేషం పెంచుకుంటాడేమో. జ్ఞానం గలవాడికి హితవాక్కులు బోధిస్తే వాడు నిన్ను ప్రేమిస్తాడు.
9 ¶ జ్ఞానం గలవాడికి బుద్ధి చెప్పినప్పుడు మరింత జ్ఞానం పొందుతాడు. న్యాయం జరిగించే వాడికి నీతి వాక్కులు బోధిస్తే వాడు తన జ్ఞానాన్ని వృద్ధి చేసుకుంటాడు.
10 ¶ జ్ఞానం కలిగి ఉండడానికి మూలాధారం యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఉండడమే. వివేకానికి ఆధారం పరిశుద్ధుడైన దేవుణ్ణి గూర్చిన తెలివి కలిగి ఉండడమే.
11 ¶ నా మూలంగానే నువ్వు జీవించే కాలం పెరుగుతుంది. నువ్వు బతికే సంవత్సరాలు ఎక్కువ అవుతాయి.
12 ¶ నువ్వు జ్ఞానం గలవాడివైతే నీ జ్ఞానం నీకే ఉపయోగపడుతుంది. నువ్వు అపహాసకుడివైతే దానివల్ల కలిగే ఫలితాలు నువ్వే భరించాలి.
13 ¶ బుద్ధిహీనత అనే స్త్రీ గావుకేకలు పెట్టేది. ఆమె తెలివితక్కువది, చదువు లేనిది.
14 ¶ ఆమె తన ఇంటి వాకిట్లో కూర్చుంటుంది. పట్టణ ప్రముఖ వీధుల్లో కుర్చీ వేసుకుని కూర్చుంటుంది.
15 ¶ ఆ దారిలో వెళ్ళేవాళ్ళను, తమ దారిన తాము తిన్నగా వెళ్ళేవారిని చూసి,
16 “జ్ఞానం లేనివాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడికి రండి” అని వాళ్ళను పిలుస్తుంది.
17 ¶ తెలివి లేని ఒకడు వచ్చినప్పుడు వాణ్ణి చూసి “దొంగిలించిన నీళ్లు తియ్యగా ఉంటాయి. దొంగచాటుగా తిన్న తిండి రుచిగా ఉంటుంది” అని చెబుతుంది.
18 ¶ అయితే చనిపోయిన వాళ్ళు అక్కడ ఉన్నారనీ, ఆమె ఇంట్లోకి వెళ్ళిన వాళ్ళంతా నరక కూపంలో పడిపోతారనీ వాళ్ళు తెలుసుకోలేరు.