All books in తెలుగు IRV

కీర్తన 58

తెలుగు IRV · chapter 58

150 అధ్యాయాలు

తెలుగు IRV / కీర్తన / అధ్యాయం 58

తెలుగు IRV · chapter 58

1 అధికారులారా! మీరు న్యాయంగా మాట్లాడటం నిజమేనా? మనుషులకు, మీరు నిజాయితీగా న్యాయ తీర్పు తీరుస్తారా?

2 లేదు, అలా చెయ్యరు. మీరు ఇష్టపూర్వకంగా చెడుతనం జరిగిస్తారు. దేశంలో మీ చేతులారా దౌర్జన్యాన్ని కొలిచి మరీ జరిగిస్తున్నారు.

3 దుర్మార్గులు పుట్టుకతోనే విపరీత బుద్ధి కలిగి ఉంటారు. పుట్టిన వెంటనే అబద్ధాలాడుతూ తప్పిపోతారు.

4 వారు చిమ్మేది నాగుపాము విషం. వారు చెవులు మూసుకున్న చెవిటి పాముల వంటివారు.

5 మంత్రగాళ్ళు ఎంతో నేర్పుగా మంత్రం వేసినా వారు ఎంతమాత్రం పట్టించుకోరు.

6 దేవా, వారి నోట్లో పళ్ళు విరగ్గొట్టు. యెహోవా, ఆ సింహం పిల్లల కోరలు ఊడబెరుకు.

7 పారుతున్న నీరులాగా వారు గతించిపోతారు గాక. వారు విడిచిన బాణాలు ముక్కలుగా విరిగిపోతాయి గాక.

8 వారు కరిగిపోయి కనిపించకుండా పోయే నత్తల్లాగా ఉంటారు. నవమాసాలు నిండకుండానే పుట్టే పిండంలాగా సూర్యుణ్ణి ఎన్నటికీ చూడలేరు.

9 మీ కుండలకు ముళ్లకంపల మంట వేడి తగలకముందే అది ఉడికినా ఉడకకపోయినా ఆయన సుడిగాలిలో దాన్ని ఎగరగొడతాడు.

10 వారికి కలిగిన శిక్షను చూసి నీతిమంతులు సంతోషిస్తారు. ఆ దుష్టుల రక్తంలో వారు తమ పాదాలు కడుక్కుంటారు.

11 కాబట్టి నీతిమంతులకు కచ్చితంగా బహుమానం కలుగుతుంది. న్యాయం తీర్చే దేవుడు నిజంగా ఈ లోకంలో ఉన్నాడు, అని మనుషులు ఒప్పుకుంటారు.