All books in తెలుగు IRV

సామెత 12

తెలుగు IRV · chapter 12

31 chapters

తెలుగు IRV / సామెత / Chapter 12

తెలుగు IRV · chapter 12

1 ¶ జ్ఞానం కోరుకున్నవాడు గద్దింపుకు లోబడతాడు. దిద్దుబాటును తిరస్కరించేవాడు పశువుతో సమానం.

2 ¶ నీతిమంతుణ్ణి యెహోవా దయతో చూస్తాడు. చెడ్డ తలంపులు మనసులో ఉంచుకున్నవాణ్ణి ఆయన నేరస్తుడిగా ఎంచుతాడు.

3 ¶ దుర్మార్గుల వలన అందరూ అల్లకల్లోలం అవుతారు. నీతిమంతుల పునాదులు స్థిరంగా ఉంటాయి.

4 ¶ యోగ్యురాలైన భార్య తన భర్తకు కిరీటం వంటిది. భర్తకు సిగ్గు కలిగించే ఇల్లాలు అతని ఎముకలకు పట్టిన కుళ్లు.

5 ¶ నీతిమంతులు చెప్పే ఆలోచనలు న్యాయసమ్మతం. దుర్మార్గుల సలహాలు మోసంతో కూడినవి.

6 ¶ దుర్మార్గుల మాటలు హత్య చేయడానికి కాపు కాసి ఉన్న హంతకుల వంటివి. యథార్థపరుల మాట వల్ల వాళ్ళు విడుదల పొందుతారు.

7 ¶ దుర్మార్గులు పాడైపోయి లోకంలో లేకుండా పోతారు. నీతిమంతుల నివాసం స్థిరంగా నిలుస్తుంది.

8 ¶ ఒక్కొక్క మనిషి తన బుద్ధి కుశలతను బట్టి ఘనత పొందుతాడు. కపట వర్తనుడు తిరస్కారానికి గురౌతాడు.

9 ¶ తినడానికి లేకపోయినా తన గురించి గొప్పలు చెప్పుకునేవాడి కంటే ఎదో ఒక చిన్న పని-సేవకుడుగా అయినా సరే-చేసుకుంటూ ఉండడం మంచిది.

10 ¶ ఉత్తముడు తమ పశువుల ప్రాణాల పట్ల దయ చూపుతాడు. దుష్టులు చూపించే ప్రేమ క్రూరత్వమే.

11 ¶ తన భూమిని సేద్యం చేసుకునే వాడికి ఆహారం సమృద్ధిగా దొరుకుతుంది. బుద్ధిహీనుడు వ్యర్థమైన వాటిని అనుసరిస్తాడు.

12 ¶ దుర్మార్గులు చెడ్డవారికి దొరికిన దోపుడు సొమ్ము కోసం ఆశపడతారు. నీతిమంతుల ఉనికి వర్ధిల్లుతుంది.

13 ¶ వ్యర్ధమైన మాటల వల్ల కలిగే దోషం ప్రాణాంతకమైన ఉరి వంటిది. నీతిమంతులు ఆపదలను తప్పించుకుంటారు.

14 ¶ మనిషి తన నోటి మాటల ఫలం మూలంగా మంచితనంతో తృప్తి పొందుతాడు. ఎవరు చేసే పనులను బట్టి వాళ్ళకు ఫలితం దక్కుతుంది.

15 ¶ మూర్ఖుడు నడిచే మార్గం వాడి దృష్టికి సరియైనదిగా అనిపిస్తుంది. జ్ఞానం గలవాడు మంచి మాటలు ఆలకిస్తాడు.

16 ¶ మూర్ఖుల కోపం వెంటనే బయట పడుతుంది. వివేకం గలవాడు తనకు జరిగిన అవమానం వెల్లడి పరచక మౌనం వహిస్తాడు.

17 ¶ సత్యం కోసం నిలబడేవాడు నీతిగల మాటలు పలుకుతాడు. అబద్ద సాక్ష్యం పలికేవాడు కపటపు మాటలు పలుకుతాడు.

18 ¶ కత్తిపోటులాంటి మాటలు పలికే వాళ్ళు ఉన్నారు. జ్ఞానుల మాటలు ఆరోగ్యం కలిగిస్తాయి.

19 ¶ నిజాలు పలికే పెదవులు ఎప్పటికీ స్థిరంగా ఉంటాయి. అబద్ధాలు పలికే నాలుక ఉనికి క్షణకాలం.

20 ¶ కీడు తలపెట్టేవాళ్ళ హృదయాల్లో మోసం ఉంటుంది. శాంతి కోసం సలహాలు ఇచ్చేవాళ్ళకు సంతోషం కలుగుతుంది.

21 ¶ నీతిమంతులకు ఎలాంటి హానీ జరగదు. దుర్మార్గులను కష్టాలు వెంటాడుతుంటాయి.

22 ¶ అబద్ధాలు పలికే పెదవులంటే యెహోవాకు అసహ్యం. నిజాయితీపరులను ఆయన ప్రేమిస్తాడు.

23 ¶ వివేకం ఉన్నవాడు తన ప్రతిభను దాచిపెడతాడు. తెలివితక్కువ వాళ్ళు తమ మూర్ఖత్వాన్ని బయట పెడతారు.

24 ¶ ఒళ్ళువంచి పనిచేసే వాళ్ళు అధికారం సంపాదిస్తారు. సోమరిపోతులు ఊడిగం చెయ్యాల్సి వస్తుంది.

25 ¶ విచారం నిండిన హృదయం క్రుంగిపోతుంది. దయగల మంచి మాట హృదయానికి సంతోషం కలిగిస్తుంది.

26 ¶ ఉత్తముడు తన పొరుగువాడు సన్మార్గంలో నడిచేలా చేస్తాడు. దుర్మార్గుల దుష్ట ప్రవర్తన మూలంగా వారు దారి తప్పిపోతారు.

27 ¶ సోమరిపోతు వేటకు వెళ్ళినా ఏమీ పట్టుకోలేడు. చురుకుదనం కలిగి ఉండడం గొప్ప వరం.

28 ¶ నీతిమార్గంలో జీవం ఉంది. జీవమార్గంలో మరణం అనేది ఉండదు.