All books in తెలుగు IRV

సామెత 22

తెలుగు IRV · chapter 22

31 chapters

తెలుగు IRV / సామెత / Chapter 22

తెలుగు IRV · chapter 22

1 ¶ గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు, వెండి బంగారాలకంటే దయ మరింత అభిలషించ దగినవి.

2 ¶ ఐశ్వర్యవంతులు, దరిద్రులు వీరిద్దరినీ సృష్టించింది యెహోవాయే.

3 ¶ బుద్ధిమంతుడు అపాయం రావడం చూసి దాక్కుంటాడు. ఆజ్ఞానులు అనాలోచనగా పోయి బాధలు కొని తెచ్చుకుంటారు.

4 ¶ యెహోవా పట్ల భయభక్తులు వినయాన్ని, ఐశ్వర్యాన్ని, ఘనతను, జీవాన్ని తెస్తాయి.

5 ¶ ముళ్ళు, ఉచ్చులు మూర్ఖుల దారిలో ఉన్నాయి. తనను కాపాడుకొనేవాడు వాటికి దూరంగా ఉంటాడు.

6 ¶ పసివాడు నడవాల్సిన మార్గమేదో వాడికి నేర్పించు. వయసు పైబడినా వాడు అందులోనుండి తొలగడు.

7 ¶ ఐశ్వర్యవంతుడు పేదలపై పెత్తనం చేస్తాడు. అప్పుచేసిన వాడు అప్పిచ్చిన వాడికి బానిస.

8 ¶ దుర్మార్గాన్ని విత్తనంగా చల్లేవాడు కీడు అనే పంట కోసుకుంటాడు. వాడి క్రోధమనే కర్ర నిరర్థకమై పోతుంది.

9 ¶ ఉదార గుణం గలవాడికి దీవెన. ఎందుకంటే అతడు తన ఆహారంలో కొంత పేదవాడికి ఇస్తాడు.

10 ¶ తిరస్కారబుద్ధి గలవాణ్ణి వెళ్ళగొట్టు. కలహాలు, పోరాటాలు, అవమానాలు వాటంతట అవే సద్దు మణుగుతాయి.

11 ¶ శుద్ధ హృదయాన్ని ప్రేమిస్తూ ఇంపైన మాటలు పలికే వాడికి రాజు స్నేహితుడౌతాడు.

12 ¶ జ్ఞానం గలవాడిపై యెహోవా చూపు నిలుపుకుని అతణ్ణి కాపాడతాడు. విశ్వాస ఘాతకుల మాటలు ఆయన కొట్టి పారేస్తాడు.

13 ¶ సోమరి “బయట సింహం ఉంది, బయటికి వెళ్తే చచ్చిపోతాను” అంటాడు.

14 ¶ వేశ్య నోరు లోతైన గొయ్యి. యెహోవా శాపాన్ని మూటగట్టుకున్నవాడు దానిలో పడతాడు.

15 ¶ పిల్లవాడి హృదయంలో మూఢత్వం సహజంగానే ఉంటుంది. బెత్తంతో విధించే శిక్ష దాన్ని వాడిలోనుండి తోలివేస్తుంది.

16 ¶ తన ఆస్తిపాస్తులు పెంచుకోవాలని పేదలను పీడించే వారికి, ధనవంతులకే ఇచ్చే వాడికి నష్టమే కలుగుతుంది.

17 ¶ శ్రద్ధగా జ్ఞానుల ఉపదేశం ఆలకించు. నేనిచ్చే తెలివిని పొందడానికి మనసు లగ్నం చెయ్యి.

18 ¶ నీ అంతరంగంలో వాటిని నిలుపుకోవడం, అవన్నీ నీ పెదవులపై ఉండడం ఎంతో రమ్యం.

19 ¶ నీవు యెహోవాను ఆశ్రయించేలా నీకు, అవును, నీకే గదా నేను ఈ రోజున వీటిని ఉపదేశించాను?

20 ¶ వివేకం, విచక్షణ గల శ్రేష్ఠమైన సూక్తులు నేను నీకోసం రాయలేదా?

21 ¶ నిన్ను పంపేవారికి నీవు యథార్థంగా జవాబులిచ్చేలా, నమ్మదగిన సత్యవాక్కులు నీకు నేర్పించ లేదా?

22 ¶ పేదవాడు గదా అని పేదవాణ్ణి దోచుకోవద్దు. పట్టణ ద్వారాల దగ్గర నిస్సహాయులను నలగ గొట్టవద్దు.

23 ¶ యెహోవా వారి పక్షంగా వాదిస్తాడు. వారిని దోచుకొనేవారి ప్రాణాలు ఆయన దోచుకుంటాడు.

24 ¶ కోపం అదుపులో ఉంచుకోలేని వాడితో స్నేహం చెయ్య వద్దు. క్రోధంతో రంకెలు వేసే వాడి దగ్గరికి వెళ్ల వద్దు.

25 ¶ నువ్వు కూడా వాడి ధోరణి నేర్చుకుని నీ ప్రాణానికి ఉరి తెచ్చుకుంటావేమో జాగ్రత్త.

26 ¶ అప్పులకు హామీ ఉండకు. ఇతరుల బాకీలకు పూచీ తీసుకోకు.

27 ¶ ఆ అప్పు తీర్చడానికి నీ దగ్గర ఏమీ లేకపోతే వాడు నువ్వు పడుకునే పరుపు తీసుకు పోకుండా ఆపడం ఎలా?

28 ¶ నీ పూర్వీకులు వేసిన పురాతనమైన పొలిమేర రాతిని నీవు తీసివేయకూడదు.

29 ¶ తన పనిలో నిపుణతగల వాణ్ణి చూసావా? వాడు రాజుల సమక్షంలోనే నిలబడతాడు, మామూలు వాళ్ళ ఎదుట కాదు.