All books in తెలుగు IRV

సామెత 25

తెలుగు IRV · chapter 25

31 chapters

తెలుగు IRV / సామెత / Chapter 25

తెలుగు IRV · chapter 25

1 ¶ ఇవికూడా సొలొమోను సామెతలే. యూదారాజు హిజ్కియా సేవకులు వీటిని ఎత్తి రాసారు.

2 ¶ విషయాన్ని గోప్యంగా ఉంచడం దేవునికి ఘనత. సంగతిని పరిశోధించడం రాజులకు ఘనత.

3 ¶ ఆకాశాల ఎత్తు, భూమి లోతు, రాజుల అభిప్రాయం అగమ్యగోచరం.

4 ¶ వెండిలోని కల్మషం తీసేస్తే లోహకారుడు తన పనితనంతో వస్తువు తయారు చేస్తాడు.

5 ¶ రాజు సముఖం నుండి దుష్టులను తొలగించ గలిగితే అతని సింహాసనం నీతిమూలంగా స్థిరం అవుతుంది.

6 ¶ రాజు ఎదుట నీ గొప్ప చెప్పుకోకు. గొప్పవారికి కేటాయించిన చోట ఉండవద్దు.

7 ¶ నీవు గమనించి చూసిన ప్రధాని ఎదుట ఎవరైనా నిన్ను తగ్గించడం కంటే “ఈ పైచోటికి రా” అని అతడు నీతో చెప్పడం మంచిది కదా.

8 ¶ అనాలోచితంగా న్యాయ స్థానానికి పోవద్దు. చివరికి నీ పొరుగువాడు నిన్ను అవమాన పరచి “ఇక నువ్వేమి చేస్తావు?” అని నీతో అంటాడు కదా.

9 ¶ నీ పొరుగువాడితో నీవు వాదులాడ వచ్చు గానీ ఎదుటి వ్యక్తి గుట్టు నలుగురిలో రట్టు చెయ్యవద్దు.

10 ¶ అలా చేస్తే వినేవాడు నిన్ను అవమానపరుస్తాడేమో. ఆ విధంగా నీకు కలిగిన అపకీర్తి ఎన్నటికి మాసిపోదు.

11 ¶ సమయోచితంగా పలికిన మాట వెండి పళ్ళెంలో పొదిగిన బంగారు పండ్ల వంటిది.

12 ¶ బంగారు చెవిపోగులు ఎలాటివో స్వర్ణాభరణాలు ఎలాటివో వినే వాడి చెవికి జ్ఞానం గల ఉపదేశకుడు అలాటి వాడు.

13 ¶ నమ్మకమైన దూత తనను పంపిన వారిపాలిట కోతకాలపు మంచు చల్లదనం వంటి చల్లదనం గలవాడు. వాడు తన యజమానుల హృదయానికి ఆహ్లాదం కలిగిస్తాడు.

14 ¶ ఏమీ ఇవ్వకుండానే ఇచ్చానని సొంత డబ్బా వాయించుకునే వాడు వర్షం లేని మబ్బుతో గాలితో సమానం.

15 ¶ సహనంతో న్యాయాధిపతిని ఒప్పించవచ్చు. సాత్వికమైన నాలుక ఎముకలను నలగగొట్టగలదు.

16 ¶ నీకు తేనె దొరికితే మితంగా తిను. మితిమీరి తింటే ఒకవేళ కక్కి వేస్తావేమో.

17 ¶ మాటిమాటికి నీ పొరుగువాడి ఇంటికి వెళ్లకు. అతడు విసికిపోయి నిన్ను ద్వేషిస్తాడేమో.

18 ¶ తన పొరుగువాడిపై అబద్ధ సాక్ష్యం పలికేవాడు యుద్ధంలో వాడే గదలాంటి వాడు, కత్తిలాంటి వాడు. వాడియైన బాణం వంటివాడు.

19 ¶ కష్టకాలంలో విశ్వాస ఘాతకుణ్ణి ఆశ్రయించడం విరిగిన పన్నుతో, కీలు వసిలిన కాలుతో సమానం.

20 ¶ దుఃఖితుడి ఎదుట పాటలు వినిపించేవాడు చలి రోజున పైబట్ట తీసివేసే వాడితోను సూరేకారం మీద చిరక పోసే వాడితోను సమానం.

21 ¶ నీ పగవాడు ఆకలిగా ఉంటే వాడికి అన్నం పెట్టు. దాహంతో ఉంటే వాడికి మంచినీళ్ళు ఇవ్వు.

22 ¶ అలా చేస్తే వాడి తలపై నిప్పులు కుప్పగా పోసిన వాడివౌతావు. యెహోవా అందుకు నీకు ప్రతిఫలమిస్తాడు.

23 ¶ ఉత్తర వాయువు వాన తెస్తుంది. అలానే గుట్టు బయట పెట్టేవాడి ముఖం గంభీరంగా ఉంటుంది.

24 ¶ గయ్యాళితో పెద్ద భవంతిలో ఉండడం కంటే మిద్దెమీద ఒక మూలన ఉండడమే హాయి.

25 ¶ దప్పిగొన్నవాడికి చల్లని నీరు ఎలాగో దూరదేశం నుండి వచ్చిన శుభసమాచారం అలా.

26 ¶ కలకలు అయిపోయిన ఊట, చెడిపోయిన నీటిబుగ్గ, ఉత్తముడు దుష్టుడికి లోబడి ఉండడం ఒకటే.

27 ¶ తేనె మితిమీరి తినడం మంచిది కాదు. గొప్ప కోసం అదే పనిగా పాకులాడడం అలాటిదే.

28 ¶ ప్రాకారం లేక పాడైన పురం ఎంతో తన మనస్సు అదుపు చేసుకోలేని వాడు అంతే.