తెలుగు IRV / యోహాను / అధ్యాయం 10
తెలుగు IRV · chapter 10
1 ¶ ‹మీతో కచ్చితంగా చెబుతున్నాను, గొర్రెల దొడ్డిలోకి ప్రవేశ ద్వారం గుండా కాకుండా వేరే విధంగా ఎక్కి లోపలికి వచ్చేవాడు దొంగే, వాడు దోపిడీగాడే.›
2 ‹ప్రవేశ ద్వారం ద్వారా వచ్చేవాడు గొర్రెల కాపరి.›
3 ‹అతని కోసం కాపలావాడు ద్వారం తెరుస్తాడు. గొర్రెలు అతని స్వరం వింటాయి. తన సొంత గొర్రెలను అతడు పేరు పెట్టి పిలిచి బయటకు నడిపిస్తాడు.›
4 ‹తన సొంత గొర్రెలనన్నిటిని బయటకి ఎప్పుడు నడిపించినా, వాటికి ముందుగా అతడు నడుస్తాడు. అతని స్వరం గొర్రెలకు తెలుసు కాబట్టి అవి అతని వెంట నడుస్తాయి.›
5 ‹వేరేవారి స్వరం వాటికి తెలియదు కాబట్టి అవి వారి వెంట వెళ్ళకుండా పారిపోతాయి.›
6 ¶ యేసు ఈ ఉపమానం ద్వారా వారితో మాట్లాడాడు గాని ఆయన వారితో చెప్పిన ఈ సంగతులు వారికి అర్థం కాలేదు.
7 అందుకు యేసు మళ్ళీ వారితో ఇలా అన్నాడు, ‹“మీతో కచ్చితంగా చెబుతున్నాను, గొర్రెల ప్రవేశ ద్వారం నేనే.›
8 ‹నా ముందు వచ్చిన వారంతా దొంగలు, దోపిడిగాళ్ళే. గొర్రెలు వారి మాట వినలేదు.›
9 ¶ ‹నేనే ప్రవేశ ద్వారం, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశిస్తే వాడికి రక్షణ దొరుకుతుంది. వాడు లోపలికి వస్తూ బయటకి వెళ్తూ పచ్చికను కనుగొంటాడు.›
10 ‹దొంగ కేవలం దొంగతనం, హత్య, నాశనం చెయ్యడానికి మాత్రమే వస్తాడు. గొర్రెలకు జీవం కలగాలని, ఆ జీవం సమృద్ధిగా కలగాలని నేను వచ్చాను.›
11 ¶ ‹నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కోసం తన ప్రాణం ఇస్తాడు.›
12 ‹జీతం కోసం పని చేసేవాడు కాపరిలాంటి వాడు కాదు. గొర్రెలు తనవి కావు కాబట్టి తోడేలు రావడం చూసి గొర్రెలను వదిలిపెట్టి పారిపోతాడు. తోడేలు ఆ గొర్రెలను పట్టుకుని చెదరగొడుతుంది.›
13 ‹జీతగాడు జీతం మాత్రమే కోరుకుంటాడు కాబట్టి గొర్రెలను పట్టించుకోకుండా పారిపోతాడు.›
14 ¶ ‹నేను గొర్రెలకు మంచి కాపరిని. నా గొర్రెలు నాకు తెలుసు. నా సొంత గొర్రెలకు నేను తెలుసు.›
15 ‹నా తండ్రికి నేను తెలుసు. నాకు నా తండ్రి తెలుసు. నా గొర్రెల కోసం ప్రాణం పెడతాను.›
16 ‹ఈ గొర్రెలశాలకు చెందని ఇతర గొర్రెలు నాకు ఉన్నాయి. వాటిని కూడా నేను తీసుకురావాలి. అవి నా స్వరం వింటాయి. అప్పుడు ఉండేది ఒక్క మంద, ఒక్క కాపరి.›
17 ¶ ‹నా ప్రాణం మళ్ళీ పొందడానికి దాన్ని పెడుతున్నాను. అందుకే నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు.›
18 ‹నా ప్రాణాన్ని నానుంచి ఎవ్వరూ తీసివేయలేరు. నేను స్వయంగా నా ప్రాణం పెడుతున్నాను. దాన్ని పెట్టడానికి, తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం ఉంది. ఈ ఆజ్ఞ నా తండ్రి నుంచి నేను పొందాను.”›
19 ¶ ఈ మాటలవల్ల యూదుల్లో మళ్ళీ విభేదాలు వచ్చాయి.
20 వారిలో చాలా మంది, “ఇతనికి దయ్యం పట్టింది. ఇతను పిచ్చివాడు. ఇతని మాటలు మీరు ఎందుకు వింటున్నారు?” అన్నారు.
21 ఇంకొంతమంది, “ఇవి దయ్యం పట్టినవాడి మాటలు కాదు. దయ్యం గుడ్డివారి కళ్ళు తెరవగలదా?” అన్నారు.
22 ¶ ఆ తరువాత యెరూషలేములో ప్రతిష్ట పండగ వచ్చింది. అది చలికాలం.
23 అప్పుడు యేసు దేవాలయ ప్రాంగణంలో ఉన్న సొలొమోను మంటపంలో నడుస్తూ ఉండగా
24 యూదులు ఆయన చుట్టూ చేరి ఆయనతో. “ఎంతకాలం మమ్మల్ని ఇలా సందేహంలో ఉంచుతావు? నువ్వు క్రీస్తువైతే మాతో స్పష్టంగా చెప్పు” అన్నారు.
25 ¶ అందుకు యేసు వారితో ఇలా అన్నాడు, ‹“నేను మీకు చెప్పాను గాని మీరు నమ్మడం లేదు. నా తండ్రి పేరిట నేను చేస్తున్న క్రియలు నా గురించి సాక్ష్యం ఇస్తున్నాయి.›
26 ‹అయినా, మీరు నా గొర్రెలు కానందువల్ల మీరు నమ్మడం లేదు.›
27 ‹నా గొర్రెలు నా స్వరం వింటాయి, అవి నాకు తెలుసు, అవి నా వెంట వస్తాయి.›
28 ‹నేను వాటికి శాశ్వత జీవం ఇస్తాను కాబట్టి అవి ఎప్పటికీ నశించిపోవు. వాటిని ఎవరూ నా చేతిలోనుంచి లాగేసుకోలేరు.›
29 ‹వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికన్నా గొప్పవాడు కాబట్టి నా తండ్రి చేతిలోనుంచి ఎవరూ వాటిని లాగేసుకోలేరు.›
30 ‹నేను, నా తండ్రి, ఒకటే!”›
31 ¶ అప్పుడు యూదులు ఆయనను కొట్టడానికి రాళ్ళు పట్టుకున్నారు.
32 యేసు వారితో, ‹“తండ్రి నుంచి ఎన్నో మంచి పనులు మీకు చూపించాను. వాటిలో ఏ మంచి పనినిబట్టి నన్ను రాళ్ళతో కొట్టాలని అనుకుంటున్నారు?”› అన్నాడు.
33 అందుకు యూదులు, “నువ్వు మనిషివై ఉండి నిన్ను నీవు దేవుడుగా చేసుకుంటున్నావు. దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొడుతున్నాం. మంచి పనులు చేసినందుకు కాదు” అని ఆయనతో అన్నారు.
34 యేసు వారికి జవాబిస్తూ ఇలా అన్నాడు, ‹“‘మీరు దేవుళ్ళని నేనన్నాను’ అని మీ ధర్మశాస్త్రంలో రాసి లేదా?›
35 ‹లేఖనం వ్యర్థం కాదు. దేవుని వాక్కు ఎవరికి వచ్చిందో, వారిని ఆయన దేవుళ్ళని పిలిస్తే,›
36 ‹తండ్రి పవిత్రంగా ఈ లోకంలోకి పంపినవాడు ‘నేను దేవుని కుమారుణ్ణి’ అని అంటే ‘నువ్వు దేవదూషణ చేస్తున్నావు’ అని మీరు అంటారా?›
37 ‹నేను నా తండ్రి పనులు చెయ్యకపోతే నన్ను నమ్మకండి.›
38 ‹అయితే, నేను నా తండ్రి పనులు చేస్తూ ఉంటే, మీరు నన్ను నమ్మకపోయినా, తండ్రి నాలోను నేను తండ్రిలోను ఉన్నామని మీరు తెలుసుకుని అర్థం చేసుకునేందుకు ఆ పనులను నమ్మండి.”›
39 వారు మళ్ళీ ఆయనను పట్టుకోవాలనుకున్నారు గాని ఆయన వారి చేతిలో నుండి తప్పించుకున్నాడు.
40 ¶ యేసు మళ్ళీ యొర్దాను నది అవతలికి వెళ్ళి అక్కడే ఉన్నాడు. యోహాను మొదట బాప్తిసం ఇస్తూ ఉన్న స్థలం ఇదే.
41 చాలా మంది ఆయన దగ్గరికి వచ్చారు. వారు, “యోహాను ఏ సూచక క్రియలూ చేయలేదు గాని ఈయన గురించి యోహాను చెప్పిన సంగతులన్నీ నిజమే” అన్నారు.
42 అక్కడ చాలా మంది యేసుని నమ్మారు.