All books in తెలుగు IRV

సామెత 28

తెలుగు IRV · chapter 28

31 అధ్యాయాలు

తెలుగు IRV / సామెత / అధ్యాయం 28

తెలుగు IRV · chapter 28

1 ¶ ఎవరూ తరుమకుండానే దుష్టుడు పారిపోతాడు. నీతిమంతులు సింహం లాగా ధైర్యంగా ఉంటారు.

2 ¶ దేశస్థుల దోషం వల్ల దాని పాలకులు ఎక్కువ అవుతారు. బుద్ధిజ్ఞానం గలవారిచేత దాని అధికారం స్థిర పడుతుంది.

3 ¶ పేదలను బాధించే పేదవాడు ఆహారపదార్థాలను కొట్టుకుపోయేలా చేసే వానతో సమానం.

4 ¶ ధర్మశాస్త్రాన్ని తోసిపుచ్చేవారు దుష్టులను పొగుడుతుంటారు. ధర్మశాస్త్రాన్ని అనుసరించేవారు వారితో పోరాడతారు.

5 ¶ దుష్టులు న్యాయమేదో గ్రహించరు. యెహోవాను ఆశ్రయించే వారికి అన్నీ తెలుసు.

6 ¶ వంచన మూలంగా డబ్బు సంపాదించినవాడి కంటే యథార్థంగా ప్రవర్తించే దరిద్రుడు మెరుగు.

7 ¶ ఉపదేశం అంగీకరించే తనయుడు బుద్ధిమంతుడు. తుంటరుల సహవాసం చేసేవాడు తన తండ్రికి అపకీర్తి తెస్తాడు.

8 ¶ డబ్బు వడ్డీకిచ్చి అన్యాయ లాభం చేత ఆస్తి పెంచుకునేవాడు దరిద్రులను కరుణించేవాడి కోసం దాన్ని కూడబెడతాడు.

9 ¶ ధర్మశాస్త్రం వినబడకుండా చెవులు మూసుకునే వాడి ప్రార్థన అసహ్యం.

10 ¶ యథార్థవంతులను దుర్మార్గంలో పడవేసే వాడు తాను తవ్విన గోతిలో తానే పడతాడు. నిష్కళంకులకు మంచి వారసత్వం దొరుకుతుంది.

11 ¶ ఐశ్వర్యవంతుడు తన దృష్టికి తానే జ్ఞాని. వివేకం గల పేదవాడు వాడి అసలు రంగు బయట పెడతాడు.

12 ¶ నీతిపరులకు జయం కలగడం మహాఘనతకు కారణం. దుష్టులు అధికారానికి వచ్చేటప్పుడు ప్రజలు దాగిఉంటారు.

13 ¶ అతిక్రమాలను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకుని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు.

14 ¶ ఎల్లప్పుడూ ఎవరైతే చేడు పనులు చేయకుండా భయంతో ఉంటారో వాడు ధన్యుడు. హృదయాన్ని కఠినపరచుకొనేవాడు కీడులో పడిపోతాడు.

15 ¶ పేద ప్రజలను పరిపాలించే దుష్టుడు గర్జించే సింహం, దాడి చేసే ఎలుగుబంటి లాంటి వాడు.

16 ¶ వివేకం లేకుండా ప్రజానీకాన్ని పీడించే అధికారి క్రూరుడు. దగాకోరుతనాన్ని ద్వేషించేవాడు దీర్ఘాయుష్మంతుడౌతాడు.

17 ¶ వేరొకడి రక్తం చిందించిన వాడు దోషం మూటగట్టుకొన్నవాడు. వాడు మరణ దినం దాకా పారిపోతూనే ఉంటాడు.

18 ¶ యథార్థంగా ప్రవర్తించేవాడు క్షేమంగా ఉంటాడు. మూర్ఖప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోతాడు.

19 ¶ తన పొలం సేద్యం చేసుకునే వాడికి కడుపునిండా అన్నం దొరకుతుంది. వ్యర్థమైన వాటిని అనుసరించేవారికి కలిగే పేదరికం అంతా ఇంతా కాదు.

20 ¶ నమ్మకమైనవాడికి దీవెనలు మెండుగా కలుగుతాయి. ధనవంతుడయ్యేటందుకు ఆత్రంగా ఉండే వాడు శిక్ష తప్పించుకోడు.

21 ¶ పక్షపాతం చూపడం మంచిది కాదు. కేవలం ఒక్క రొట్టెముక్క కోసం కొందరు తప్పు చేస్తారు.

22 ¶ చెడు దృష్టిగలవాడు ఆస్తి సంపాదించాలని ఆతురపడతాడు. తనకు దరిద్రత వస్తుందని వాడికి తెలియదు.

23 ¶ ముఖ స్తుతి మాటలు పలికే వాడికంటే మనుషులకు బుద్ధి చెప్పేవాడు తుదకు ఎక్కువ మెప్పు పొందుతాడు.

24 ¶ తన తలిదండ్రుల సొమ్ము దోచుకుని “అది ద్రోహం కాదు” అనుకొనేవాడు నాశనం చేసే వాడికి జతకాడు.

25 ¶ దురాశ గలవాడు కలహం రేపుతాడు. యెహోవా పట్ల నమ్మకం పెట్టుకునే వాడు వర్ధిల్లుతాడు.

26 ¶ తన మనస్సులోని ఆలోచనలను నమ్ముకునేవాడు బుద్ధిహీనుడు. జ్ఞానంగా ప్రవర్తించేవాడు తప్పించుకుంటాడు.

27 ¶ పేదలకు ఇచ్చే వాడికి లేమి కలగదు. వారిని చూడకుండా కళ్ళు మూసుకునే వాడికి ఎన్నో శాపాలు కలుగుతాయి.

28 ¶ దుష్టులు అధికారంలోకి వస్తున్నప్పుడు ప్రజలు దాక్కుంటారు. దుర్మార్గులు నశించేటప్పుడు నీతిమంతులు వృద్ధి చెందుతారు.