كل أسفار తెలుగు IRV

సామెత 14

తెలుగు IRV · الأصحاح 14

31 أصحاحات

తెలుగు IRV / సామెత / الأصحاح 14

తెలుగు IRV · الأصحاح 14

1 ¶ జ్ఞానం ఉన్న స్త్రీ తన ఇంటిని చక్కబెట్టుకుంటుంది. మూర్ఖురాలు చేతులారా తన కాపురం నాశనం చేసుకుంటుంది.

2 ¶ యెహోవాపట్ల భయం, భక్తి ఉన్నవాడు నిజాయితీగా మసులుకుంటాడు. కపటంగా ప్రవర్తించే వాడు ఆయనను తిరస్కరిస్తాడు.

3 ¶ మూర్ఖుల నోటిలో గర్వం అనే బెత్తం ఉన్నది. జ్ఞానం గలవారి నోటి నుంచి వచ్చే మాటలు వారిని కాపాడతాయి.

4 ¶ ఎద్దులు లేకపోతే కొట్లలో ధాన్యం ఉండదు. ఎద్దులు బలంగా ఉంటే అధిక రాబడి వస్తుంది.

5 ¶ నమ్మకమైన సాక్షి అబద్ధం పలకడు. కపట సాక్షికి అబద్ధాలు చెప్పడమే ఇష్టం.

6 ¶ బుద్ధిహీనుడు జ్ఞానం కోసం వెదికినా అది దొరకదు. తెలివిగలవాడు తేలికగా జ్ఞానం పొందుతాడు.

7 ¶ బుద్ధిహీనుడి దగ్గర మంచి మాటలు ఏమీ దొరకవు కనుక వాడితో స్నేహం చేయవద్దు.

8 ¶ వివేకం ఉన్నవారు తమ ప్రవర్తన విషయంలో జ్ఞానం కలిగి జాగ్రత్తగా ప్రవర్తిస్తారు. బుద్ధి లేనివారు తమ మూర్ఖత్వంతో మోసపూరిత కార్యాలు జరిగిస్తారు.

9 ¶ మూర్ఖులు చేసే అపరాధ పరిహార బలి వారిని ఎగతాళి చేస్తుంది. యథార్థవంతులు ఒకరిపట్ల ఒకరు దయ కలిగి ఉంటారు.

10 ¶ ఎవడి హృదయంలో ఉండే దుఃఖం వాడికే తెలుస్తుంది. ఒకడి సంతోషంలో బయటి వ్యక్తి పాలు పొందలేడు.

11 ¶ దుర్మార్గుడి ఇల్లు నాశనం అవుతుంది. యథార్థవంతుల గుడారం స్థిరంగా నిలుస్తుంది.

12 ¶ ఒకడు తనకు నచ్చినదే సరియైనదిగా భావిస్తాడు. అయితే చివరికి అది నాశనానికి నడిపిస్తుంది.

13 ¶ ఒకడు బయటికి నవ్వుతో ఉన్నప్పటికీ హృదయంలో దుఃఖం ఉండవచ్చు. సంతోషం చివరికి శోకంగా మారిపోవచ్చు.

14 ¶ భక్తిహీనుడి మార్గాలు చివరికి వాడికే వెగటు కలుగుతాయి. మంచి వ్యక్తి తన ప్రవర్తన పట్ల సంతృప్తి చెందుతాడు.

15 ¶ తెలివితక్కువవాడు ప్రతి విషయాన్నీ నమ్ముతాడు. వివేకం గలవాడు తన ప్రవర్తన విషయంలో జాగ్రత్త వహిస్తాడు.

16 ¶ జ్ఞానం ఉన్నవాడు కీడుకు భయపడి దాని నుంచి దూరంగా వెళ్తాడు. మూర్ఖుడు అహంకారంతో భయం లేకుండా తిరుగుతాడు.

17 ¶ తొందరగా కోపం తెచ్చుకునేవాడు తన మూర్ఖత్వం ప్రదర్శిస్తాడు. చెడు ఆలోచనలు చేసేవాడు ద్వేషానికి గురౌతాడు.

18 ¶ బుద్ధిహీనులు తమ మూర్ఖత్వమే ఆస్తిగా కలిగి ఉంటారు. వివేకం ఉన్నవారు జ్ఞానాన్ని కిరీటంగా ధరించుకుంటారు.

19 ¶ చెడ్డవారు మంచివారి ఎదుట, భక్తిహీనులు నీతిమంతుల గుమ్మాల ఎదుట నిలబడతారు.

20 ¶ దరిద్రుణ్ణి వాడి పొరుగువాడే అసహ్యించుకుంటాడు. ధనవంతుణ్ణి ప్రేమించే వాళ్ళు చాలామంది.

21 ¶ పేదవారిని ఆదరించేవాడు ధన్యజీవి. తన పొరుగువాణ్ణి తిరస్కరించేవాడు పాపం చేసినట్టే.

22 ¶ కీడు తలపెట్టేవారు కూలిపోతారు. మేలు చేసే వారికి దయ, సత్యం ప్రాప్తిస్తాయి.

23 ¶ కష్టంతో కూడిన ఏ పని చేసినా ఫలితం దక్కుతుంది. వ్యర్ధమైన మాటలు దరిద్రానికి నడుపుతాయి.

24 ¶ ఐశ్వర్యం జ్ఞానులకు కిరీటం వంటిది. బుద్ధిహీనుల మూర్ఖత్వం వారికి మరింత మూర్ఖత్వం తెచ్చిపెడుతుంది.

25 ¶ నిజాలు పలికే సాక్షి మనుషులను కాపాడతాడు. అబద్ధాలు చెప్పేవాడు కేవలం మోసగాడు.

26 ¶ యెహోవాపట్ల భయం, భక్తి కలిగి ఉన్నవారు ఎంతో ధైర్యంగా ఉంటారు. వారి సంతానానికి ఆశ్రయం దొరుకుతుంది.

27 ¶ యెహోవా పట్ల భయభక్తులు జీవం కలిగించే ఊట. దాని మూలంగా వారు మరణం ఉచ్చుల్లో నుండి తప్పించు కుంటారు.

28 ¶ జనాభా పెరుగుదల రాజులకు ఘనత కలిగిస్తుంది. ప్రజల క్షీణత రాజుల పతనానికి కారణం.

29 ¶ వివేకం గలవాడు త్వరగా కోపం తెచ్చుకోడు. ముక్కోపికి మూర్ఖత్వమే బహుమతిగా దక్కుతుంది.

30 ¶ సాత్వికమైన మనస్సు శరీరానికి జీవం పెంచుతుంది. అసూయ ఎముకలు కుళ్ళిపోయేలా చేస్తుంది.

31 ¶ దరిద్రుణ్ణి కష్టపెట్టేవాడు వాడి సృష్టికర్త అయిన దేవుణ్ణి దూషించినట్టే. పేదవారిని ఆదరించేవాడు దేవుణ్ణి ఘనపరుస్తున్నాడు.

32 ¶ కీడు కలిగినప్పుడు తమ చెడ్డ పనుల వల్ల భక్తిహీనులు నశిస్తారు. నీతిమంతునికి సత్య సమయంలో కూడా ఆశ్రయం దొరుకుతుంది.

33 ¶ తెలివిగలవాడి హృదయంలో జ్ఞానం సుఖంగా నివసిస్తుంది. బుద్ధిహీనులు తమ మనసులో ఉన్నది తొందరగా బయటపెతారు.

34 ¶ ప్రజలు ఘనత పొందడానికి వారి న్యాయవర్తన కారణం అవుతుంది. అపరాధ ప్రవర్తన ప్రజలను అవమానాల పాలు చేస్తుంది.

35 ¶ తెలివి గల సేవకుడు రాజుల అభిమానం చూరగొంటాడు. అవమానం కలిగించే సేవకుడి పై రాజు కోప పడతాడు.