كل أسفار తెలుగు IRV

సామెత 27

తెలుగు IRV · الأصحاح 27

31 أصحاحات

తెలుగు IRV / సామెత / الأصحاح 27

తెలుగు IRV · الأصحاح 27

1 ¶ రేపటి రోజును గూర్చి డంబాలు పలక వద్దు. ఏ రోజున ఏమి జరుగుతుందో ఎవరికి తెలుసు?

2 ¶ నీ నోరు కాదు, వేరొకరు ఎవరన్నా, నీ స్వంత పెదవులు కాదు ఇతరులే నిన్ను పొగడాలి.

3 ¶ రాయి బరువు ఇసక భారం గదా. మూర్ఖుడి కోపం ఆ రెంటికంటే బరువు.

4 ¶ క్రోధం క్రూరమైనది. కోపం వరదలాగా ముంచెత్తుతుంది. రోషం ఎదుట నిలవ గలిగేది ఎవరు?

5 ¶ లోలోపల ప్రేమించడం కంటే బహిరంగంగా గద్దించడం మేలు.

6 ¶ స్నేహితుడు మేలు కోరి గాయాలు చేస్తాడు. శత్రువు లెక్క లేనన్ని ముద్దులు పెడతాడు.

7 ¶ కడుపు నిండిన వాడు తేనెపట్టునైనా సరే కాళ్ళతో తొక్కేస్తాడు. ఆకలి వేసిన వాడికి చేదు పదార్థమైనా తియ్యగా ఉంటుంది.

8 ¶ తన సొంత ఇల్లు విడిచిపెట్టి తిరిగేవాడు గూడు విడిచి తిరిగే పక్షితో సమానం.

9 ¶ పరిమళం, సుగంధం హృదయాన్ని సంతోషపెడుతుంది. అలాగే మిత్రుడి హృదయంలో నుండి వచ్చే మధుర వాక్కులు హృదయాన్ని సంతోషపెడతాయి.

10 ¶ నీ స్నేహితుడినైనా నీ తండ్రి స్నేహితుడినైనా విడిచి పెట్టవద్దు. నీ ఆపద దినాన నీ అన్నదమ్ముల ఇళ్ళకు వెళ్లకు. దూరంగా ఉన్న సోదరుడి కంటే దగ్గరున్న పొరుగువాడే మంచిది.

11 ¶ కుమారా, జ్ఞానం సంపాదించి నా హృదయాన్ని సంతోషపెట్టు. అప్పుడు నన్ను నిందించే వారితో నేను ధైర్యంగా మాటలాడతాను.

12 ¶ బుద్ధిమంతుడు అపాయం రావడం చూసి దాక్కుంటాడు. జ్ఞానం లేనివారు నిర్లక్ష్యంగా ఆపదలో పడతారు.

13 ¶ ఎదుటి మనిషి విషయంలో హామీ ఉండే వాడి నుంచి అతని వస్త్రం తీసుకో. ఇతరుల కోసం పూచీ తీసుకున్న వాడిచేత వాడి వస్తువులు తాకట్టు పెట్టించు.

14 ¶ పొద్దున్నే లేచి పెద్ద గొంతుకతో తన స్నేహితుణ్ణి దీవించే వాడి దీవెన అతని పాలిట శాపమే.

15 ¶ ముసురు పట్టిన రోజున ఏక ధారగా కురుస్తూ ఉండే నీళ్లు, గయ్యాళి ఇల్లాలు ఒకటే.

16 ¶ ఆమెను ఆపాలని ప్రయత్నించేవాడు గాలిని ఆపాలని ప్రయత్నించే వాడితో సమానం. తన కుడిచేతిలో నూనె పట్టుకోవాలని ప్రయత్నించడంతో సమానం.

17 ¶ ఇనుము చేత ఇనుము పదును అవుతుంది. అలాగే ఒక మనిషి తన సాటి మనిషికి పదును పెడతాడు.

18 ¶ అంజూరు చెట్టు పెంచేవాడు దాని పండ్లు తింటాడు. తన యజమానిని గౌరవించే వాడు ఘనత పొందుతాడు.

19 ¶ నీటిలో ముఖానికి ముఖం కనబడినట్టు ఒకడి మనస్సుకు మరొకడి మనస్సు కనబడుతుంది.

20 ¶ పాతాళానికి, అగాధానికి తృప్తి ఉండదు. అలానే మనిషి కోరికలకు ఎప్పటికీ తృప్తి ఉండదు.

21 ¶ మూసతో వెండిని కొలిమితో బంగారాన్ని తాను పొందిన కీర్తితో మనిషిని పరీక్షించి చూడ వచ్చు.

22 ¶ మూర్ఖుడిని గోదుమలలోబాటు రోకలితో దంచినా వాడి మూఢత వాణ్ణి వదలిపోదు.

23 ¶ నీ పశువుల స్థితి జాగ్రత్తగా తెలిసుకో. నీ మందల మీద మనస్సు ఉంచు.

24 ¶ డబ్బు శాశ్వతం కాదు. కిరీటం తరతరాలు ఉంటుందా?

25 ¶ ఎండిన గడ్డి వామి వేస్తారు. పచ్చిక ఇక కనిపించడం లేదు. మొలకలు వస్తున్నాయి. ఆలమందల కోసం కొండగడ్డి కోసుకొస్తున్నారు.

26 ¶ నీకు వెచ్చటి బట్టల కోసం గొర్రెపిల్లలున్నాయి. ఒక చేను కొనడానికి మేకలు సరిపోతాయి.

27 ¶ నీ ఆహారానికి, నీ కుటుంబం తినే ఆహారానికి, నీ దాసదాసీల పోషణకు మేకపాలు ఉంటాయి.