గంటల ప్రార్థనలు

ప్రస్తుత గంట

ఆరవ ఘడియ – సెక్స్ట్

శిలువ వేయబడిన క్రీస్తును స్మరించి, మా మనస్సులను పాపం నుండి విడిపించి, లోకానికి వెలుగుగా చేయమని ప్రభువును వేడుకుంటాము.

ప్రతి గంటకు ముందుమాట

తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ నామమున

ఏకైక దేవుడు. ఆమేన్.

ప్రభువా, కరుణించుము. ప్రభువా, కరుణించుము. ప్రభువా, ఆశీర్వదించుము. ఆమేన్.

తండ్రికి, కుమారునికి, పరిశుద్ధాత్మకును మహిమ ఇప్పుడు, ఎల్లప్పుడును, యుగయుగాల యుగములవరకు. ఆమేన్.

ప్రభు ప్రార్థన

‹కాబట్టి మీరు ఇలా ప్రార్థన చేయండి.› ‹“పరలోకంలో ఉన్న మా తండ్రీ, నీ నామం పవిత్రంగా ఉండు గాక.›

‹నీ రాజ్యం వస్తుంది గాక.› ‹పరలోకంలో నీ ఇష్టం ఎలా నెరవేరుతున్నదో అలాగే భూమి మీద కూడా నెరవేరు గాక.›

‹మా అనుదిన ఆహారం ఈ రోజు మాకు దయచెయ్యి.›

‹మాకు రుణపడి ఉన్న వారిని మేము క్షమించినట్టు మా రుణాలు క్షమించు.›

‹మేము పరీక్షల పాలు కాకుండా దుష్టుని నుండి తప్పించు.”›

కృతజ్ఞతా ప్రార్థన

మంచి కార్యముల నియంతయైన కరుణామయుడగు దేవునికి, మన ప్రభువును దేవునును రక్షకుడునైన యేసు క్రీస్తు తండ్రికి, మనము కృతజ్ఞతాస్తుతులు సాగిద్దము; ఎందుకనగా ఆయన మనలను కప్పెను, సహాయపడ్డాడు, కాపాడెను, తనవద్దకు అంగీకరించెను, మనమీద కనికరించెను, ఆశ్రయమిచ్చెను, ఈ గడియకు మమ్మును చేర్చెను. ఇదే యేలా, ఈ పరిశుద్ధ దినమునను, మన జీవమునందలి సమస్త దినములను కూడా సంపూర్ణ సమాధానముతో కాపాడుమని ఆయనను మనము ప్రార్థించుదము. సర్వాధికారియగు ప్రభువైన మన దేవుడు.

ఓ ప్రభువైన దేవా, సర్వాధికారియగు వాడా, మన ప్రభువును దేవునును రక్షకుడునైన యేసు క్రీస్తు తండ్రియగు వాడా, సమస్త కాలమందు, సమస్త విషయములను గూర్చి, సమస్త పరిస్థితులయందు నీకు కృతజ్ఞతాస్తుతులు చేసుచున్నాము; ఎందుకనగా నీవు మనలను కప్పితివి, సహాయపడియున్నావు, కాపాడితివి, నీవద్దకు అంగీకరించితివి, మనమీద కనికరించితివి, ఆశ్రయమిచ్చితివి, ఈ గడియకు మమ్మును చేర్చితివి.

ఈ కారణముచేత, మానవులను ప్రేమించువాడా, నీ సౌమ్యతయొద్దనుండి మేము అడిగి వేడుకొనుచున్నాము: నీ భయముతో కూడి ఈ పరిశుద్ధ దినమును, మన జీవితములోని సమస్త దినములను కూడా సంపూర్ణ సమాధానముతో పూర్తిచేయుటకు మాకు అనుగ్రహించుము. ప్రతి ఈర్ష్యనూ, ప్రతి శోధననూ, సాతాను యొక్క ప్రతి క్రియనూ, దుష్టుల కుట్రలనూ, ప్రత్యక్షముగానూ గోప్యముగానూ లేచిన శత్రువులనూ, మాకును నీ సమస్త ప్రజలపైనా, ఈ నీ పరిశుద్ధ స్థలంపైనా దూరముచేయుము. శ్రేయస్కరముగాను ఉపయుక్తముగాను ఉన్నదానన్నిటిని మాకు ప్రసాదించుము. ఏలయనగా శత్రువు యొక్క సమస్త శక్తిమీదను, సర్పములను విచ్చుచులను తొక్కుటకు అధికారమును నీవే మాకు అనుగ్రహించితివి. మమ్మును శోధనలో పడనియ్యక, దుష్టుని నుండి విమోచించుము.

నీ ఏకైక కుమారుడగు మన ప్రభువును దేవునును రక్షకుడునైన యేసు క్రీస్తు యొక్క కృపచేతను, కరుణలచేతను, మానవులపై ప్రేమచేతను. ఆయనద్వారానే నీకు తగిన మహిమ, గౌరవము, బలము, ఆరాధన, ఆయనతోకూడ ప్రాణదాయకుడైన సమశక్తిగల పరిశుద్ధాత్మతో కలిసి, ఇప్పుడు, ఎల్లప్పుడును, యుగయుగాల యుగములవరకు చెల్లును. ఆమేన్.

కీర్తన 50

శక్తిశాలి, దేవుడు అయిన యెహోవా ఆదేశిస్తున్నాడు. పొద్దు పొడిచే దిశ నుండి పొద్దు గుంకే దిశ వరకూ ఉన్న ప్రజలందర్నీ రమ్మని పిలుస్తున్నాడు.

పరిపూర్ణ సౌందర్యం అయిన సీయోనులో నుండి దేవుడు ప్రకాశిస్తున్నాడు.

మన దేవుడు వస్తున్నాడు. ఆయన మౌనంగా ఉండడు. ఆయనకు ముందుగా భీకర అగ్ని కబళించుకుంటూ వెళ్తుంది. ఆయన చుట్టూ ప్రచండ గాలులు వీస్తున్నాయి.

తన ప్రజలకు న్యాయం తీర్చడానికి ఆయన ఆకాశాలనూ భూమినీ పిలుస్తున్నాడు.

బలి అర్పణ ద్వారా నాతో నిబంధన చేసుకున్న నా విశ్వాస పాత్రులను నా దగ్గరకు సమకూర్చండి అని పిలుస్తున్నాడు.

ఆకాశాలు ఆయన నీతిని ప్రకటిస్తున్నాయి. ఎందుకంటే దేవుడు తానే న్యాయాధిపతిగా ఉన్నాడు.

నా ప్రజలారా, వినండి. నేను మాట్లాడతాను. నేను దేవుణ్ణి. మీ దేవుణ్ణి.

నీ బలుల విషయమై నేను నిన్ను నిందించడం లేదు. మీ దహనబలులు ఎప్పుడూ నా ఎదుటే ఉన్నాయి.

నీ ఇంటి నుండి ఎద్దునైనా, నీ మందలోని మేకపోతులనైనా నేను తీసుకోను.

ఎందుకంటే అడవిలో ఉన్న ప్రతి మృగమూ నాదే. వెయ్యి కొండలపై తిరుగాడే పశువులన్నీ నావే.

కొండల్లోని పక్షులన్నీ నాకు తెలుసు. పొలాల్లోని మృగాలు నా వశమే.

నాకు ఒకవేళ ఆకలివేస్తే అది నీకు చెప్పను. ఎందుకంటే ఈ ప్రపంచమంతా నాదే. భూమిలో ఉండేదంతా నాదే.

ఎద్దుల మాంసం నేను తింటానా? మేకల రక్తం తాగుతానా?

దేవునికి నీ కృతజ్ఞతార్పణ సమర్పించు. మహోన్నతుడికి నీ ప్రమాణాలను నెరవేర్చు.

సమస్యలు చుట్టుముట్టిన రోజున నాకు ప్రార్థించు. నేను నిన్ను కాపాడతాను. నువ్వు నన్ను కీర్తిస్తావు.

కానీ దుర్మార్గులతో దేవుడు ఇలా అంటున్నాడు. నా నియమాలను ప్రకటించడానికి నీకేం పని? నా నిబంధన నీ నోట పలకాల్సిన అవసరం ఏమిటి?

ఆదేశాలను నువ్వు అసహ్యించుకుంటావు. నా మాటలు పట్టించుకోకుండా తోసివేస్తావు.

నువ్వు దొంగను చూసి వాడితో ఏకీభవిస్తావు. వ్యభిచారం చేసే వాళ్ళతో కలుస్తావు.

ఎవరికైనా అపకారం తలపెట్టడానికి నోరు తెరుస్తావు. నీ నాలుక వంచన చేస్తుంది.

కూర్చుని నీ సోదరుడికి వ్యతిరేకంగా మాట్లాడుతావు. నీ స్వంత సోదరుడిపై అపనిందలు మోపుతావు.

నువ్వు ఇలాంటి పనులు చేస్తున్నా నేను మౌనంగానే ఉన్నాను. దాంతో నన్ను నీతో సమానంగా జమ కట్టావు. కానీ నేను నువ్వు చేసిన పనులన్నిటినీ నీ కళ్ళ ఎదుటికి తీసుకువస్తాను. నిన్ను గద్దిస్తాను.

దేవుణ్ణి మర్చిపోయే వాళ్ళు ఈ సంగతి ఆలోచించండి. లేదా నేను మిమ్మల్ని ముక్కలుగా చీల్చి వేస్తాను. మీకు సహాయం చేయడానికి ఎవరూ రారు.

కృతజ్ఞతార్పణ అర్పించే వాడు నన్ను స్తుతిస్తున్నాడు. తన ప్రయాణం సరైన మార్గంలో చేయాలని ఆలోచించే వాళ్లకు నేను దేవుని ముక్తిని చూపిస్తాను.

ప్రార్థన ఆరంభము

ఈ ధన్యమైన దినములో ఆరవ గంట స్తోత్రగీతము; దానిని నా రాజు దేవుడైన క్రీస్తుకి అర్పించుచున్నాను, నా పాపములను ఆయన క్షమించునని నేనాయనును వేడుకొనుచున్నాను.

కీర్తన 53

దేవుడు లేడు అని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు. వారు చెడిపోయారు, అసహ్యకార్యాలు చేస్తారు. మంచి జరిగించేవాడు ఒక్కడూ లేడు.

జ్ఞానం కలిగి తనను వెదికేవారు ఉన్నారేమో అని దేవుడు ఆకాశం నుండి మనుషులను పరిశీలించాడు.

వారంతా దారి తప్పి పూర్తిగా చెడిపోయారు. మంచి చేసే వాడు లేడు. ఒక్కడూ లేడు.

వారు దేవునికి ప్రార్థన చేయరు. వారు నా ప్రజలను దోచుకున్నారు. వారికి ఏమీ తెలియడం లేదా?

భయకారణం లేకుండానే వారు భయభ్రాంతులయ్యారు. ఎందుకంటే నీకు వ్యతిరేకంగా పోగయ్యే వారి ఎముకలను దేవుడు విరగ్గొడతాడు. దేవుడు వారిని తోసిపుచ్చాడు కాబట్టి వారు సిగ్గుపడతారు.

సీయోనులో నుండి ఇశ్రాయేలుకు రక్షణ కలుగుతుంది. దేవుడు తన ప్రజలను చెరలో నుండి వెనక్కి రప్పించేటప్పుడు యాకోబు సంతానం హర్షిస్తుంది. ఇశ్రాయేలు ప్రజలు సంతోషిస్తారు.

కీర్తన 56

దేవా, నన్ను కరుణించు. మనుషులు నన్ను మింగివేయాలని చూస్తున్నారు. వారు రోజంతా నా మీద పోరాడుతూ నన్ను అణచివేస్తున్నారు.

గర్వంగా నాతో పోరాడేవారు అనేకులున్నారు. రోజంతా నా కోసం కాపు కాసి నన్ను మింగాలని చూస్తున్నారు.

నాకు భయం కలిగిన రోజున నిన్ను ఆశ్రయిస్తాను.

నేను ఆయన మాటలను కీర్తిస్తాను. నేను భయపడను. ఎందుకంటే దేవునిలో నమ్మకం పెట్టుకున్నాను. మనుషులు నన్నేమి చేయగలరు?

రోజంతా వాళ్ళు నా మాటల్లో తప్పులు వెతుకుతారు. నాకు ఎప్పుడు హాని చేయాలా అని చూస్తుంటారు.

వాళ్ళు గుంపులు గుంపులుగా కాపు కాస్తారు. నన్ను చంపాలని నన్ను వెంబడిస్తూ ఉంటారు.

దేవా, నీ కోపంతో ప్రజలను అణగదొక్కు. వాళ్ళు చేస్తున్న దుష్ట క్రియల ఫలితాలు అనుభవించేలా చెయ్యి.

నా పలాయనాలను నువ్వు లెక్కించావు. నా అశ్రువులు నీ ఎదుట ఉన్న సీసాలో నింపావు. అవన్నీ నీ పుస్తకంలో కనిపిస్తాయి కదా.

నేను నీకు మొరపెట్టిన రోజున నా శత్రువులు వెనక్కి మళ్లుతారు. దేవుడు నా పక్షాన ఉన్నాడని నాకు తెలుసు.

నా దేవుణ్ణి బట్టి ఆయన నామాన్ని కీర్తిస్తాను. యెహోవాను బట్టి ఆయన వాక్కును ఘనపరుస్తాను.

నేను దేవునిపై నమ్మకం పెట్టుకున్నాను. నేను భయపడను, మనుషులు నన్నేమి చేయగలరు?

దేవా, నువ్వు చావునుండి నా ప్రాణాన్ని తప్పించావు. నేను జీవపు వెలుగులో దేవుని ఎదుట సంచరించాలని నా అడుగులు జారకుండా తప్పించావు.

అందుకే నేను నీకు మొక్కుకున్నాను. నీకు స్తుతియాగాలు అర్పిస్తాను.

కీర్తన 60

దేవా, మమ్మల్ని విడిచిపెట్టావు. మమ్మల్ని విరగగొట్టావు. మాపై కోపం పెంచుకున్నావు. మమ్మల్ని మళ్ళీ బాగు చెయ్యి.

నీవు దేశాన్ని వణికించావు. దాన్ని ముక్కలుగా చేశావు. అది వణికిపోతున్నది. దానికి తగిలిన గాయాలు బాగు చెయ్యి.

నీ ప్రజలకు నీ కఠినమైన కార్యాలు కనపరిచావు. మేము తూలిపోయేలా చేసే మద్యాన్ని మాకు తాగించావు.

సత్యం నిమిత్తం ఎత్తి పట్టుకోవడానికి నీలో భయభక్తులు గలవారికి నీవొక ధ్వజాన్ని ఇచ్చావు.

నువ్వు ప్రేమించే వారికి విమోచన కలిగేలా నీ కుడిచేతితో నన్ను రక్షించి నాకు జవాబు చెప్పు.

తన పరిశుద్ధత తోడని దేవుడు ప్రమాణం చేశాడు. నేను ఆనందిస్తాను! షెకెమును పంచిపెడతాను, సుక్కోతు లోయను కొలిపించి ఇస్తాను.

గిలాదు నాది, మనష్షే నాది. ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణం, యూదా నా రాజదండం.

మోయాబు నేను కాళ్లు కడుక్కునే పళ్ళెం. ఎదోము మీద నా చెప్పు విసిరేస్తాను. ఫిలిష్తియను బట్టి నేను సింహనాదం చేస్తాను.

కోటగల బలమైన పట్టణంలోకి నన్ను ఎవడు తోడుకుని వెళ్తాడు? ఎదోములోకి నన్ను ఎవడు నడిపిస్తాడు? అన్నాడు.

దేవా, నువ్వు మమ్మల్ని విడిచిపెట్టావు కదా? మా సేనలతో కలిసి బయలుదేరడం నువ్వు మానేశావు కదా?

మనుషుల సహాయం ప్రయోజనం లేనిది. శత్రువులను జయించడానికి మాకు సహాయం చెయ్యి.

దేవుని సహాయంతో మేము విజయం సాధిస్తాము. మా శత్రువులను అణగదొక్కేవాడు ఆయనే.

కీర్తన 62

నా ప్రాణం దేవుని కోసం మౌనంగా కనిపెడుతున్నది. ఆయన వలన నాకు రక్షణ కలుగుతుంది.

ఆయనే నా ఆశ్రయదుర్గం. నా రక్షణకర్త. నా ఉన్నతమైన గోపురం ఆయనే. నన్నెవరూ పూర్తిగా కదలించలేరు.

ఎన్నాళ్లు మీరంతా ఒక్క మనిషిపై దాడి చేస్తారు? ఒకడు ఒరిగిపోయే గోడను, పడిపోతున్న కంచెను కూలదోసినట్టు నీవు ఎంతకాలం ఒక్కణ్ణి కూలదోయాలని చూస్తారు?

గౌరవప్రదమైన స్థానం నుండి అతణ్ణి పడదోయడానికే వారు అతనితో ఆలోచిస్తారు. అబద్ధాలు చెప్పడం వారికి సంతోషం. వారు తమ నోటితో దీవెనలు పలుకుతూ వారి హృదయాల్లో మాత్రం అతన్ని శపిస్తారు.

నా ప్రాణమా, మౌనంగా ఉండి దేవుని కోసం కనిపెట్టు. ఆయన వల్లనే నాకు నిరీక్షణ కలుగుతున్నది.

ఆయనే నా ఆధార శిల, నా రక్షణ. ఎత్తయిన నా గోపురం ఆయనే. నన్నెవరూ పూర్తిగా కదలించలేరు

దేవునిలోనే నా రక్షణ, నా మహిమ. నా బలమైన దుర్గం, నా ఆశ్రయం ఆయనలోనే ఉన్నాయి.

ప్రజలారా, ఆయనలో నిరంతరం నమ్మకం ఉంచండి. ఆయన సన్నిధిలో మీ హృదయాలు కుమ్మరించండి. దేవుడే మనకు ఆశ్రయం.

నిజానికి తక్కువ స్థాయి మనుషులు ఎందుకూ పనికిరానివారు. గొప్పవారేమో మాయలాంటివారు. త్రాసులో వారంతా తేలిపోతారు. వారందరినీ కలిపి తూచినా వారు గాలికన్నా తేలికగా ఉన్నారు.

బలాత్కారంలో, దోచుకోవడంలో నమ్మకం పెట్టుకోవద్దు. ఐశ్వర్యంలో వ్యర్ధంగా మనసు నిలపవద్దు. ఎందుకంటే అవేవీ ఫలించవు.

ప్రభావం తనదే అని దేవుడు ఒకసారి చెప్పాడు. రెండుసార్లు నేనా మాట విన్నాను.

కృప చూపడం నీకే చెల్లుతుంది. ఎందుకంటే ప్రభూ, మనుష్యులందరికీ వారు చేసిన క్రియల ప్రకారం నువ్వే ప్రతిఫలమిస్తున్నావు.

కీర్తన 66

సర్వలోకమా, దేవుని గూర్చి ఆనంద ధ్వనులు చెయ్యి. ఆయన బలమైన నామాన్ని కీర్తించండి.

ఆయన నామానికి మహిమ ఆపాదించండి. ఆయనకు స్తోత్రాలు చెప్పండి.

నీ కార్యాలు ఎంతో భీకరమైనవి. నీ మహా శక్తిని బట్టి నీ శత్రువులు నీకు లోబడతారు.

లోకమంతా నీకు నమస్కరించి నిన్ను కీర్తిస్తుంది, నీ నామాన్నిబట్టి నిన్ను కీర్తిస్తుంది, అంటూ దేవుణ్ణి ఘనపరచండి. సెలా.

దేవుని ఆశ్చర్యకార్యాలు వచ్చి చూడండి. మనుషులకు ఆయన చేసే కార్యాలు చూసినప్పుడు ఆయన భీకరుడుగా ఉన్నాడు.

ఆయన సముద్రాన్ని ఎండిన భూమిగా చేశాడు. ప్రజలు కాలినడకన నదిని దాటారు. అక్కడ ఆయనలో మేము సంతోషించాము.

ఆయన తన పరాక్రమంతో శాశ్వతంగా ఏలుతాడు. ఆయన కళ్ళు అన్యజాతులను పరిశీలిస్తాయి. తిరుగుబాటుచేసే ప్రజలు తమలో తాము గర్వించవద్దు.

జనాల్లారా, మా దేవుణ్ణి సన్నుతించండి. స్వరమెత్తి ఆయన కీర్తిని వినిపించండి.

మా ప్రాణాలను జీవంతో నింపేది ఆయనే. ఆయన మా నడకలు స్థిరంగా ఉంచుతాడు.

దేవా, నువ్వు మమ్మల్ని పరీక్షించావు. వెండిని పరీక్షించి నిర్మలం చేసినట్టు మమ్మల్ని పరీక్షకు గురిచేశావు.

మమ్మల్ని ఒక వలలో ఇరుక్కునేలా చేశావు. మా నడుముల మీద పెద్ద బరువు పెట్టావు.

మనుషులు మా మీద ఎక్కి స్వారీ చేస్తున్నారు. మేము నిప్పులగుండా నీళ్ళ గుండా నడిచి వెళ్ళాం. అయినా నువ్వు మమ్మల్ని విశాలమైన స్థలానికి రప్పించావు.

దహనబలులతో నేను నీ మందిరంలోకి వస్తాను.

నేను బాధల్లో ఉన్నప్పుడు నా పెదాలు, నా నోరు ప్రమాణం చేసిన మొక్కుబడులు నేను నీకు అర్పిస్తాను.

పొట్టేళ్ల హోమం ఘుమఘుమలతో కొవ్విన జంతువులను నీకు దహనబలిగా అర్పిస్తాను. ఎద్దులను, పోతుమేకలను అర్పిస్తాను.

దేవునిలో భయభక్తులు గలవారంతా వచ్చి వినండి, ఆయన నా కోసం చేసిన కార్యాలు నేను వినిపిస్తాను.

ఆయనకు నేను మొరపెట్టాను. అప్పుడే నా నాలుక ఆయన్ని కీర్తించింది.

నేను నా హృదయంలో పాపాన్ని ఉంచుకుంటే ప్రభువు నా మనవి అంగీకరించడు.

కానీ దేవుడు నా మనవి అంగీకరించాడు. ఆయన నా విన్నపాన్ని ఆలకించాడు.

దేవుడు నా ప్రార్థనను తోసిపుచ్చలేదు, నా నుండి తన కృపను తీసివేయలేదు. ఆయనకు స్తుతి కలుగు గాక.

కీర్తన 69

దేవా, నన్ను కాపాడు. నా ప్రాణం మీద నీళ్ళు పొర్లి పారుతున్నాయి.

లోతైన అగాధంలాంటి ఊబిలో నేను దిగబడిపోతున్నాను. నిలబడలేకుండా ఉన్నాను. లోతైన నీళ్ళలో నేను మునిగిపోయాను. వరదలు నన్ను ముంచెత్తుతున్నాయి.

నేను కేకలు వేసి అలసిపోయాను, నా గొంతు ఎండిపోయింది. నా దేవుని కోసం కనిపెడుతూ ఉండగా నా కళ్ళు క్షీణించాయి.

ఏ కారణం లేకుండా నా మీద పగబట్టిన వారు నా తలవెంట్రుకలకంటే ఎక్కువమంది ఉన్నారు. అకారణంగా నాకు శత్రువులై నన్ను చంపాలని చూసేవారు అనేకమంది. నేను దోచుకోని దాన్ని నేను తిరిగి ఇవ్వాల్సి వచ్చింది.

దేవా, నా బుద్ధిహీనత నీకు తెలుసు. నా పాపాలు నీకు తెలియనివి కావు.

దేవా, సేనల ప్రభువైన యెహోవా, నీ కోసం ఎదురు చూసే వారికి నా మూలంగా సిగ్గు కలగనీయవద్దు. ఇశ్రాయేలు దేవా, నిన్ను వెదికే వారు నా మూలంగా అవమానం పాలు కానీయకు.

నీ కోసం నేను నిందలు పడ్డాను. నీ కోసమే నేను సిగ్గు పడాల్సి వచ్చింది.

నా సోదరులకు నేను పరాయివాణ్ణి అయ్యాను. నా తల్లి కొడుకులకు పరదేశిని అయ్యాను.

నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను తినివేసింది. నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడ్డాయి.

నేను ఉపవాసముండి ఏడ్చినపుడు నా ఆత్మకు అది నింద కారణమైంది.

నేను గోనెపట్ట కట్టుకున్నప్పుడు వారు అపహాస్యం చేశారు.

నగర ద్వారాల్లో కూర్చున్నవారు నన్ను గురించే మాట్లాడుకుంటున్నారు. తాగుబోతులు నన్ను గూర్చి పాటలు పాడతారు.

యెహోవా, నీకే నేను ప్రార్థన చేస్తున్నాను. అనుకూల సమయంలో జవాబివ్వు. దేవా, నమ్మదగిన నీ రక్షణ సత్యాన్ని బట్టి నాకు జవాబు దయచెయ్యి.

ఊబిలోనుండి నన్ను తప్పించు. నన్ను మునిగి పోనీయకు. నన్ను ద్వేషించే వారి చేతినుండి, లోతైన జలాల నుండి నన్ను తప్పించు.

వరదలు నన్ను ముంచెయ్యనియ్యకు. అగాథం నన్ను మింగనియ్యకు. నన్ను గుంటలో పడనియ్యకు.

యెహోవా, నీ నిబంధన కృపలోని మంచితనాన్ని బట్టి నాకు జవాబివ్వు. అధికమైన నీ కృపను బట్టి నావైపు తిరుగు.

నీ సేవకుడి నుండి నీ ముఖం తిప్పుకోకు. నేను నిస్పృహలో ఉన్నాను, నాకు త్వరగా జవాబివ్వు.

నా దగ్గరికి వచ్చి నన్ను విమోచించు. నా శత్రువులను చూసి నన్ను విడిపించు.

నాకు నింద, సిగ్గు, అవమానం కలిగాయని నీకు తెలుసు. నా విరోధులంతా నీ ఎదుటే ఉన్నారు.

నింద వలన నా హృదయం బద్దలైంది. నేను ఎంతో కృశించిపోయాను. నన్ను ఎవరైనా కనికరిస్తారేమో అని చూశాను గానీ ఎవరూ లేరు. ఓదార్చే వారి కోసం కనిపెట్టాను గాని ఎవరూ కనిపించ లేదు.

వారు నాకు ఆహారంగా చేదు విషాన్ని పెట్టారు. నాకు దాహం అయినప్పుడు తాగడానికి పులిసిన ద్రాక్షరసం ఇచ్చారు.

వారి సంపద వారికి ఉరి అవుతుంది గాక. క్షేమంగా ఉన్నామని అనుకున్నప్పుడు అది వారికి ఒక బోనుగా ఉంటుంది గాక.

వారు చూడలేకపోయేలా వారి కళ్ళకు చీకటి కమ్ముతుంది గాక. వారి నడుములకు ఎడతెగని వణకు పుడుతుంది గాక.

వారి మీద నీ ఉగ్రతను కుమ్మరించు. నీ కోపాగ్ని వారిని ఆవరిస్తుంది గాక.

వారి నివాసం నిర్జనం అవుతుంది గాక. వారి గుడారాల్లో ఎవరూ నివాసం ఉండరు గాక.

నువ్వు దెబ్బ కొట్టిన వాణ్ణి వారు బాధిస్తున్నారు. నువ్వు గాయపరచిన వారి వేదన గూర్చి వారు కబుర్లాడుతున్నారు.

ఒకదాని తరవాత ఒకటిగా అపరాధాలు వారికి తగలనివ్వు. నీ నీతిగల విజయంలోకి వారిని చేరనివ్వకు.

జీవగ్రంథంలో నుండి వారి పేరు చెరిపివెయ్యి. నీతిమంతుల జాబితాలో వారి పేర్లు రాయవద్దు.

నేను బాధలో, వేదనలో మునిగి ఉన్నాను. దేవా, నీ రక్షణ నన్ను లేవనెత్తు గాక.

దేవుని నామాన్ని గానాలతో స్తుతిస్తాను. కృతజ్ఞతలతో ఆయన్ని ఘనపరుస్తాను.

ఎద్దు కంటే, కొమ్ములు డెక్కలు గల కోడె కంటే అది యెహోవాకు ఇష్టం.

దీనులు అది చూసి సంతోషిస్తారు. దేవుని వెదికేవారలారా, మీ హృదయాలు తిరిగి బ్రతుకు గాక.

అక్కరలో ఉన్నవారి ప్రార్థన యెహోవా ఆలకిస్తాడు. బంధకాల్లో ఉన్న తన వారిని ఆయన అలక్ష్యం చేయడు.

భూమీ ఆకాశాలూ ఆయనను స్తుతిస్తాయి గాక. సముద్రాలు, వాటిలోని సమస్తం ఆయనను స్తుతిస్తాయి గాక.

దేవుడు సీయోనును రక్షిస్తాడు. ఆయన యూదా పట్టణాలను తిరిగి కట్టిస్తాడు. ప్రజలు అక్కడ నివాసం ఉంటారు. అది వారి సొంతం అవుతుంది.

ఆయన సేవకుల సంతానం దాన్ని వారసత్వంగా పొందుతారు. ఆయన నామాన్ని ప్రేమించేవారు అందులో నివసిస్తారు.

కీర్తన 83

దేవా, మౌనంగా ఉండవద్దు! దేవా, మమ్మల్ని పట్టించుకోకుండా స్పందించకుండా ఉండవద్దు.

నీ శత్రువులు నీకు ఎదురు తిరుగుతున్నారు, నిన్ను ద్వేషించే వాళ్ళు రెచ్చిపోతున్నారు.

నీ ప్రజల మీద వాళ్ళు కుట్ర పన్నుతున్నారు. నువ్వు కాపాడే వాళ్ళ మీద దురాలోచన చేస్తున్నారు.

వాళ్ళిలా చెబుతున్నారు, వాళ్ళ రాజ్యాన్ని నాశనం చేద్దాం రండి. అప్పుడు ఇశ్రాయేలు అనే పేరు ఇక గుర్తుకు రాకుండా ఉంటుంది.

ఏకగ్రీవంగా వాళ్ళు ఆలోచన చేశారు. నీకు విరోధంగా ఒప్పందాలు చేసుకున్నారు.

గుడారాల్లో జీవించే ఎదోమీయులు, ఇష్మాయేలీయులు, మోయాబీయులు, హగ్రీయీలు,

గెబలు జాతి వాళ్ళు, అమ్మోనీయులు, అమాలేకీయులు, ఫిలిష్తీయులు, తూరు నివాసులు,

అష్షూరు దేశస్థులు వాళ్ళ పక్షాన చేరారు. లోతు వంశస్థులకు వాళ్ళు సాయం చేస్తున్నారు. సెలా

నువ్వు మిద్యానుకు ఏమి చేశావో కీషోను వాగు దగ్గర నువ్వు సీసెరాకు, యాబీనుకు ఏమి చేశావో అలాగే వారికి చెయ్యి.

వాళ్ళు ఏన్దోరు దగ్గర నాశనమై పోయారు. నేలకు ఎరువు అయ్యారు.

ఓరేబు, జెయేబు నాయకులకు నువ్వు చేసినట్టు వారి ప్రధానులకు చెయ్యి. జెబహు సల్మున్నా అనే వారికి నువ్వు చేసినట్టు వాళ్ళ రాజులందరికీ చెయ్యి.

దేవుని పచ్చిక భూములను మనం ఆక్రమించుకుందాం అని వాళ్ళు అంటున్నారు.

నా దేవా, సుడి తిరిగే దుమ్ములాగా, గాలికి కొట్టుకుపోయే పొట్టులాగా వాళ్ళను చెయ్యి.

మంటలు అడవిని కాల్చివేసినట్టు, కారుచిచ్చు కొండలను తగలబెట్టినట్టు,

నీ తుఫానుతో వాళ్ళను తరిమి వెయ్యి. నీ సుడిగాలిచేత వారికి భయం పుట్టించు.

యెహోవా, వాళ్ళు నీ నామాన్ని వెతికేలా వాళ్ల ముఖాలకు అవమానం కలిగించు.

వాళ్ళు ఎప్పుడూ అవమానం, భయం అనుభవించాలి, వాళ్ళు సిగ్గుపాలై నాశనం కావాలి.

యెహోవా అనే పేరున్న నువ్వు మాత్రమే లోకమంతట్లో మహోన్నతుడవని వాళ్ళు తెలుసుకుంటారు.

కీర్తన 84

సేనల ప్రభువైన యెహోవా, నువ్వు నివసించే చోటు ఎంత మనోహరం!

యెహోవా మందిరావరణాల కోసం నా ప్రాణం ఎంతో ఆశగా ఉంది. తహతహలాడుతూ ఉంది. సజీవ దేవుని కోసం నా హృదయం, నా సమస్తం కేకలు పెడుతున్నది.

సేనల ప్రభువైన యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠం దగ్గర పిచ్చుకలకు నివాసం దొరికింది. తన పిల్లలను పెట్టడానికి వానకోయిలకు గూడు దొరికింది.

నీ ఇంట్లో నివసించేవాళ్ళు ధన్యులు, వాళ్ళు ఎప్పుడూ నిన్ను స్తుతిస్తూ ఉంటారు. సెలా

ఎవరి బలమైతే నీలోనే ఉన్నదో వాడు ధన్యుడు. సీయోను రాజమార్గాన్ని హృదయంలో ఉంచుకున్నవాడు ధన్యుడు.

వారు విలాప లోయగుండా వెళుతూ నీటి ఊటలు కనుగొంటారు. తొలకరి వాన దాన్ని జలమయంగా చేస్తుంది.

వాళ్ళ బల ప్రభావం ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంటుంది. వాళ్ళలో ప్రతివాడూ సీయోనులో దేవుని ఎదుట కనబడతాడు.

యెహోవా, సేనల ప్రభువైన దేవా, నా ప్రార్థన విను. యాకోబు దేవా, నేను చెప్పేది ఆలకించు. సెలా.

దేవా, మా డాలుకు కాపలాగా ఉండు. నువ్వు అభిషేకించిన వాడి పట్ల శ్రద్ధ చూపు.

నీ ఆవరణాల్లో గడిపిన ఒక రోజు, బయట గడిపిన వెయ్యి రోజుల కంటే మేలు. దుర్మార్గుల గుడారాల్లో ఉండడం కంటె నా దేవుని ఆలయానికి కాపలావాడిగా ఉండడం నాకిష్టం.

యెహోవా దేవుడు మన సూర్యుడు, మన డాలు. యెహోవా కృప, ఘనత ఇస్తాడు, యథార్ధంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలూ చేయకుండా మానడు.

సేనల ప్రభువైన యెహోవా, నీ మీద నమ్మకం ఉంచేవాళ్ళు ధన్యులు.

కీర్తన 85

యెహోవా, నువ్వు నీ దేశాన్ని దయ చూశావు, యాకోబు వంశస్తుల క్షేమాన్ని తిరిగి ఇచ్చావు.

నీ ప్రజల పాపాలు క్షమించావు, వారి పాపాలన్నీ కప్పివేశావు. సెలా.

నీ ఉగ్రతనంతా మానుకున్నావు, నీ తీవ్ర కోపాన్ని చల్లార్చుకున్నావు.

మా రక్షణకర్తవైన దేవా, మమ్మల్ని ఉద్ధరించు. మా మీద నీ కోపం చాలించు.

మా మీద కలకాలం కోపంగా ఉంటావా? తరతరాలుగా నీ కోపం సాగిస్తావా?

నీ ప్రజలు నీ వలన సంతోషించేలా నువ్వు మళ్ళీ మమ్మల్ని బ్రతికించవా?

యెహోవా, నీ కృప మాకు చూపించు, నీ రక్షణ మాకు అనుగ్రహించు.

యెహోవా దేవుడు తెలియచేసే మాట నేను వింటాను, ఆయన తన ప్రజలతో తన నమ్మకమైన అనుచరులతో శాంతితో మసలుతాడు. అయితే వాళ్ళు మళ్ళీ మూర్ఖులు కాకూడదు.

ఆయన పట్ల భయభక్తులున్న వారికి ఆయన రక్షణ అతి సమీపంగా ఉంది. అప్పుడు మన దేశంలో మహిమ నిలిచి ఉంటుంది.

నిబంధన విశ్వసనీయత, నమ్మకత్వం కలుసుకున్నాయి, నీతిన్యాయాలు, శాంతిసమాధానాలు ఒకదానినొకటి ముద్దు పెట్టుకున్నాయి.

భూమిలోనుంచి విశ్వాస్యత మొలుస్తుంది. ఆకాశం నుంచి విజయం తొంగిచూస్తుంది.

యెహోవా తన మంచి దీవెనలనిస్తాడు. మన భూమి దాని పంటనిస్తుంది.

నీతి ఆయనకు ముందుగా నడుస్తుంది. ఆయన అడుగుజాడలకు దారి ఏర్పరస్తుంది.

కీర్తన 86

యెహోవా, నేను పేదవాణ్ణి. నన్ను అణిచి వేశారు. నా మాట విని నాకు జవాబివ్వు.

నేను నీ విధేయుణ్ణి. నన్ను కాపాడు. నా దేవా, నిన్ను నమ్ముకున్న నీ సేవకుణ్ణి రక్షించు.

ప్రభూ, రోజంతా నీకు మొరపెడుతున్నాను, నన్ను కనికరించు.

ప్రభూ, నా ఆత్మ నీ వైపు ఎత్తుతున్నాను. నీ సేవకుడు సంతోషించేలా చెయ్యి.

ప్రభూ, నువ్వు మంచివాడివి. క్షమించడానికి సిద్ధంగా ఉంటావు. నీకు మొరపెట్టే వారందరినీ అమితంగా కనికరిస్తావు.

యెహోవా, నా ప్రార్థన విను. నా విన్నపాల శబ్దం ఆలకించు.

నా కష్టాల్లో నేను నీకు మొరపెడతాను. నువ్వు నాకు జవాబిస్తావు.

ప్రభూ, దేవుళ్ళలో నీకు సాటి ఎవరూ లేరు. నీ పనులకు సాటి ఏదీ లేదు.

ప్రభూ, నువ్వు సృజించిన రాజ్యాలన్నీ వచ్చి నీ ఎదుట ప్రణమిల్లుతారు. వాళ్ళు నీ నామాన్ని గొప్ప చేస్తారు.

నువ్వు గొప్ప వాడివి. ఆశ్చర్యమైన పనులు చేస్తావు. నీవొక్కడివే దేవుడివి.

యెహోవా, నీ పద్ధతులు నాకు బోధించు. అప్పుడు నేను నీ సత్యంలో నడుస్తాను. నిన్ను గౌరవించేలా నా హృదయాన్ని ఏక భావంగలదిగా చెయ్యి.

ప్రభూ, నా దేవా, నా హృదయమంతటితో నేను నిన్ను స్తుతిస్తాను. నీ నామాన్ని శాశ్వతకాలం గొప్ప చేస్తాను.

నా పట్ల నీ కృప ఎంతో గొప్పది. చచ్చిన వాళ్ళుండే అగాధం నుంచి నా ప్రాణాన్ని తప్పించావు.

దేవా, గర్విష్ఠులు నా మీదికి ఎగబడ్డారు. దుర్మార్గులు నా ప్రాణం తీయాలని చూస్తున్నారు. నువ్వంటే వాళ్ళకు లెక్క లేదు.

అయితే ప్రభూ, నువ్వు కృపా కనికరాలు గల దేవుడివి. కోపించడానికి నిదానించే వాడివి. అత్యంత కృపగల వాడివి. నమ్మదగిన వాడివి.

నావైపు తిరిగి నన్ను కనికరించు, నీ సేవకుడికి నీ బలం ఇవ్వు. నీ సేవకురాలి కొడుకును కాపాడు.

యెహోవా, నీ ఆదరణ గుర్తు నాకు చూపించు. అప్పుడు నన్ను ద్వేషించే వాళ్ళు అది చూచి సిగ్గుపాలవుతారు. ఎందుకంటే నువ్వు నాకు సాయం చేసి నన్ను ఆదరించావు.

కీర్తన 90

ప్రభూ, తరతరాలుగా నువ్వే మాకు నివాసస్థానం.

పర్వతాలు ఉనికిలోకి రాకముందే, భూమినీ లోకాన్నీ నువ్వు సృష్టించకముందే, ఇప్పటికీ ఎప్పటికీ నువ్వే దేవుడివి.

నువ్వు మనుషులను తిరిగి మట్టిగా మారుస్తావు. మనుషులారా, తిరిగి రండి, అంటావు.

నీ దృష్టిలో వెయ్యేళ్ళు గడిచిపోయిన నిన్నలాగా ఒక రాత్రిపూటలాగా ఉన్నాయి.

వరదలో కొట్టుకుపోయినట్టు నువ్వు వారిని లాక్కెళ్ళిపోతావు, వాళ్ళు నిద్ర పోతారు. పచ్చ గడ్డిలాగా వాళ్ళు పొద్దున్నే చిగురిస్తారు.

ఉదయాన అది మొలిచి పెరుగుతుంది, సాయంకాలం అది వాడిపోయి ఎండిపోతుంది.

నీ కోపం చేత మేము హరించుకుపోతున్నాం, నీ ఉగ్రత మమ్మల్ని భయపెడుతూ ఉంది.

మా అపరాధాలను నువ్వు నీ ఎదుట ఉంచుకున్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపాలు కనబడుతున్నాయి.

నీ ఉగ్రత భరిస్తూ మా జీవితం గడుపుతున్నాం. నిట్టూర్పులాగా మా జీవితకాలం త్వరగా గడిచిపోతుంది.

మా బలము డెభ్భై ఏళ్ళు. ఆరోగ్యంగా ఉంటే ఎనభై ఏళ్ళుకూడా ఉండొచ్చు. అయినా మా శ్రేష్ట కాలం కష్టాలూ దుఃఖాలే. అవును, అవి త్వరగా గడిచిపోతాయి. మేము ఎగిరిపోతాం.

నీ కోపం ఎంత తీవ్రమో ఎవరికి తెలుసు? నీ ఆగ్రహం దానికి తగిన భయాన్ని రేపుతుందని ఎవరికి తెలుసు?

కాబట్టి మేము జ్ఞానంగా బ్రతికేలా మా బ్రతుకును గురించి ఆలోచించడం మాకు నేర్పు.

యెహోవా, తిరిగి రా! ఎంతకాలం పడుతుంది? నీ సేవకుల పట్ల జాలి పడు.

ఉదయాన నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచు. అప్పుడు మేము మా రోజులన్నీ ఉల్లాసంగా ఆనందంగా గడుపుతాం.

నువ్వు మమ్మల్ని బాధించిన రోజుల లెక్కప్రకారం మేము కష్టాలు అనుభవించిన సంవత్సరాలకు తగ్గట్టుగా మమ్మల్ని సంతోషపరచు.

నీ సేవకులకు నీ పని చూపించు, మా సంతానం నీ వైభవాన్ని చూడనివ్వు.

మా యెహోవా దేవుని ప్రసన్నత మా మీద ఉండు గాక. మా చేతి పనిని మాకు సుస్థిరం చెయ్యి. నిజంగా, మా చేతి పనిని మాకు సుస్థిరం చెయ్యి.

కీర్తన 92

యెహోవాకు కృతజ్ఞతలు చెప్పడం, మహోన్నతుడా, నీ నామానికి స్తుతి పాడడం మంచిది.

ఉదయాన నీ కృపను ప్రతి రాత్రీ నీ విశ్వసనీయతను తెలియజేయడం మంచిది.

పది తీగల వాయిద్యంతో, సితారా మాధుర్యంతో స్తుతించడం మంచిది.

ఎందుకంటే యెహోవా, నీ పనులతో నువ్వు నన్ను సంతోషపరుస్తున్నావు. నీ చేతిపనులబట్టి నేను ఆనందంగా పాడతాను.

యెహోవా, నీ పనులు ఘనమైనవి! నీ ఆలోచనలు ఎంతో లోతైనవి.

పశుప్రాయులకు ఇవేమీ తెలియదు. తెలివిలేనివాడు అర్థం చేసుకోలేడు.

దుర్మార్గులు పచ్చని గడ్డి మొక్కల్లాగా మొలిచినా చెడ్డపనులు చేసే వాళ్ళంతా వర్ధిల్లినా నిత్యనాశనానికే గదా!

అయితే యెహోవా, నువ్వే శాశ్వతంగా పరిపాలిస్తావు.

యెహోవా, నీ శత్రువులను చూడు, చెడ్డపనులు చేసే వాళ్ళంతా చెదరిపోతారు.

అడవి దున్న కొమ్ముల్లాగా నువ్వు నా కొమ్ము పైకెత్తావు. కొత్త నూనెతో నన్ను అభిషేకించావు.

నా శత్రువుల అధోగతిని నా కన్నులు చూశాయి. దుష్టులైన నా విరోధుల పతనం నా చెవులు విన్నాయి.

నీతిమంతులు ఖర్జూర చెట్టులాగా అభివృద్ధి చెందుతారు. లెబానోనులోని దేవదారు చెట్టులాగా వాళ్ళు ఎదుగుతారు.

వాళ్ళు యెహోవా ఇంటిలో నాటుకుని ఉంటారు. వాళ్ళు మన దేవుని ఆవరణాల్లో వర్ధిల్లుతారు.

యెహోవా యథార్థవంతుడని తెలియచేయడం కోసం వాళ్ళు ముసలితనంలో కూడా ఫలిస్తారు. తాజాగా పచ్చగా ఉంటారు.

ఆయనే నా ఆధార శిల, ఆయనలో ఎలాంటి అన్యాయమూ లేదు.

పరిశుద్ధ సువార్త మత్తయి వ్రాసిన ప్రకారం (5:1–16)

¶ యేసు ఆ ప్రజా సమూహాన్ని చూసి కొండ ఎక్కి కూర్చున్నప్పుడు ఆయన శిష్యులు ఆయన దగ్గరికి వచ్చారు.

ఆయన తన నోరు తెరచి ఇలా ఉపదేశించ సాగాడు.

‹“ఆత్మలో దీనత్వం గలవారు ధన్యులు, పరలోకరాజ్యం వారిదే.›

‹దుఃఖించే వారు ధన్యులు, వారికి ఓదార్పు కలుగుతుంది.›

‹సాధుగుణం గలవారు ధన్యులు, ఈ భూమికి వారు వారసులవుతారు.›

‹నీతిన్యాయాల కోసం ఆకలిదప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పొందుతారు.›

‹కనికరం చూపే వారు ధన్యులు, వారు కనికరం పొందుతారు.›

‹పవిత్ర హృదయం గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు.›

‹శాంతి కుదిర్చేవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనిపించుకుంటారు.›

‹నీతి కోసం నిలబడి హింసల పాలయ్యేవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది.›

¶ ‹“నన్ను బట్టి మనుషులు మిమ్మల్ని అవమానించి, హింసించి మీమీద అన్ని రకాల అపనిందలు అన్యాయంగా వేసినప్పుడు మీరు ధన్యులు.›

‹అప్పుడు సంతోషించండి! ఉప్పొంగిపొండి. పరలోకంలో మీకు గొప్ప బహుమానం ఉంటుంది. మీకు ముందు వచ్చిన ప్రవక్తలను కూడా మనుషులు ఇలాగే హింసించారు.›

¶ ‹“లోకానికి మీరు ఉప్పు. ఉప్పు తన రుచి కోల్పోతే దానికి ఆ రుచి మళ్ళీ ఎలా వస్తుంది? అలాంటి ఉప్పు బయట పారేసి కాళ్ళ కింద తొక్కడానికి తప్ప ఇక దేనికీ పనికిరాదు.›

¶ ‹ప్రపంచానికి మీరు వెలుగుగా ఉన్నారు. కొండ మీద ఉండే ఊరు కనబడకుండా ఉండదు.›

‹ఎవరూ దీపం వెలిగించి బుట్ట కింద పెట్టరు. దీపస్తంభం మీదే పెడతారు. అప్పుడు ఆ దీపం ఇంట్లో అందరికీ వెలుగు ఇస్తుంది.›

‹మీ వెలుగు మనుషుల ముందు ప్రకాశించనీయండి. అప్పుడు వారు మీ మంచి పనులు చూసి పరలోకంలో ఉన్న మీ తండ్రిని కీర్తిస్తారు.›

Tenoo oasht emmok o piekhristos nem pekyot en aghathos nem pi epnevma ethowab je akee ak soati emmon nai nan

ఓ క్రీస్తా, నీ మేలైన తండ్రితోను పరిశుద్ధాత్మతోను కలిసి మేము నిన్ను ఆరాధిస్తున్నాము; నీవు వచ్చి మమ్మల్ని రక్షించితివి.

1. ఆరవ దినమున, ఆరవ ఘడియలో, స్వర్గపు తోటలో మన పితృవైన ఆదాము చేసిన అపరాధం నిమిత్తము నీవు శిలువకు వేయించబడినవాడా; మా పాపాల లిఖితాన్ని చింపివేయుము, ఓ క్రీస్తు మా దేవా, మమ్మల్ని రక్షించుము. నేను ప్రభువునకు మొఱ్ఱపెట్టగా ఆయన వినెను. దేవా, నా ప్రార్థనను ఆలకింపుము; నా వినతిని తిరస్కరింపకుము. సాయంకాలమునను, ఉదయమునను, మధ్యాహ్నమునను నేను నా మాటలును పలుకుదును; ఆయన నా స్వరమును ఆలకించి, నా ఆత్మను సమాధానములో విడిపించును.

Doxa Patri ke Eioa ke Agio Pnevmati

తండ్రికి, కుమారునికి, పరిశుద్ధాత్మకు మహిమ కలుగును గాక.

2. ఆరవ ఘడియలో శిలువకు వేయించబడిన మా దేవుడైన యేసుక్రీస్తు, చెట్టువల్ల పాపాన్ని చంపినవాడా; నీ సొంత చేతులతో సృష్టించిన మనిషి పాపములో చనిపోయి యుండగా నీ మరణముచేత అతనికి జీవమిచ్చినవాడా; నీ స్వస్త్యాయన కష్టాలచేత మా నొప్పులను చంపి, నీవు గుచ్చబడిన మేకులతో మా మనస్సులను భూకార్యాల అనాలోచితత మరియు లోకీయ వాంఛలనుండి విడిపించి, నీ స్వర్గీయ ఆజ్ఞలను జ్ఞాపకముంచుటకు మమ్మల్ని నడిపించుము, నీ కరుణ ప్రకారము.

Ke nin ke a ee ke ees toos e onas toan e oa noan ameen.

ఇప్పుడును యుగయుగముల వరకు. ఆమేన్.

3. మా అనేక పాపాల కారణంగా మాకు అనుగ్రహమూ లేదు, క్షమాపణకూ న్యాయపక్షమూ లేదు. అందుచేత నీ ద్వారా పుట్టినవాడైన మా రక్షకుని నీవద్దనుండే వేడుకొనుచున్నాము, ఓ దేవమాతా కన్యకా; ఎందుకంటే నీ మధ్యస్థత్వము సమృద్ధిగా యుండి ఆమోదయోగ్యమైనది. ఓ నిర్మల మాతా, నీవు కనినవాడియొద్ద నేరస్థులైన మమ్మల్ని దూరం చేయవద్దు; ఆయన కరుణగలవాడు, మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు; ఎందుకనగా మమ్మల్ని విడిపించుటకై ఆయన బాధపడెను. మనము అత్యంత వినమ్రులమై యున్నాము; కాబట్టి నీ కరుణ త్వరగా మనకు చేరు గాక. నీ నామమునకు మహిమ కలుగునట్లు దేవా, మా రక్షకుడా, మాకు సహాయకుడవై యుండు. ప్రభువా, నీ పరిశుద్ధ నామ హేతువు చేత మమ్మల్ని విడిపించి మా పాపములను క్షమించుము.

Ke nin ke a ee ke ees toos e onas toan e oa noan ameen.

ఇప్పుడును యుగయుగముల వరకు. ఆమేన్.

4. ఓ క్రీస్తు మా దేవా, నీవు శిలువపై నీ పరిశుద్ధ హస్తములను చాచి భూమ్యాకాశముల నడుమ రక్షణకార్యము నెరవేర్చితివి; అందుచేత సమస్త జనములు, “ఓ ప్రభువా, నీకే మహిమ” అని మొఱ్ఱపెడుతున్నారు.

Doxa Patri ke Eioa ke Agio Pnevmati

తండ్రికి, కుమారునికి, పరిశుద్ధాత్మకు మహిమ కలుగును గాక.

5. అవినాశియైన నీ స్వరూపాన్ని మేము ఆరాధిస్తున్నాము, ఓ మేలైనవాడా; మా పాపముల క్షమాపణ కొరకు యాచించుచున్నాము, ఓ క్రీస్తు మా దేవా. నీ స్వేచ్ఛచేత నీవు శిలువపై ఎత్తబడుటకు సంతోషించితివి, నీ సృష్టులను శత్రువుయొక్క బంధన నుండి విడిపించుటకై. నీవు వచ్చి లోకానికి సహాయమిచ్చినప్పుడు నీవు రక్షించినందున, మేమందరినీ సంతోషముతో నింపితివి; కాబట్టి నీకు మొఱ్ఱపెట్టి కృతజ్ఞతలు తెలుపుచున్నాము. ప్రభువా, నీకే మహిమ.

Ke nin ke a ee ke ees toos e onas toan e oa noan ameen.

ఇప్పుడును యుగయుగముల వరకు. ఆమేన్.

6. కృపపూర్ణురాలివైన దేవమాతా కన్యకా, నీ కుమారుని శిలువవలన హాదేసు కూలిపోయెను, మరణము రద్దు చేయబడెను; మేము చనిపోయినవారమే గాని లేచి నిత్యజీవమునకు యోగ్యులమయ్యాము; మొదటి ఏదేనే వనపు ఆనందాన్ని పొందితివి. అందుచేత, అమరుడైన క్రీస్తు మా దేవునికి కృతజ్ఞతలతో మహిమనిచ్చుచున్నాము.

తరువాత ఆరాధకుడు ఇలా ప్రార్థిస్తాడు:

ప్రభువా, మమ్మల్ని ఆలకించి మాపై కరుణ చూపి మా పాపాలను క్షమించుము. ఆమేన్.

(ప్రభువా, కరుణించుము) 41 సార్లు

అబ్సొల్యూషన్

సర్వాధికారియగు మా రాజా, మన ప్రభువును దేవునును రక్షకుడునైన యేసు క్రీస్తు తండ్రి, మేము నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము, నిన్ను మహిమపరచుచున్నాము; ఏలయనగా నీ ఏకైక కుమారుని పీడానుభవకాలములను నీవు పరామర్శయును ప్రార్థనయును గల సమయములుగా చేసితివి. మా వేడుకొనుటలను నీవద్ద అంగీకరించుము; మా మీద రాయబడి యున్న పాపపత్రికను తుడిచిపారుము; యేదివిధముగా ఈ పరిశుద్ధ గడియలో నీ ఏకైక కుమారుని క్రీస్తు మా ప్రభువుయొక్క సిలువచేత దానిని చింపివేసితివో, అట్లే చేయుము; ఆయనద్వారానే నీవు శత్రువు యొక్క సమస్త శక్తిని కూలద్రోయితివి.

దేవా, మాకు కాంతినిచ్చు కాలమును, నిష్కళంక ప్రవర్తనను, నిశ్చల జీవనాన్ని అనుగ్రహించుము; నీ ఆరాధింపబడిన పరిశుద్ధ నామమునకు సముచితంగాను, నీ మహిమాన్విత న్యాయాసనము ఎదుట తీర్పునకు నిలిచినప్పుడు దోషారోపణ లేకుండునట్లు జీవించుటకును మాకు అనుగ్రహించుము; నీ సకల పరిశుద్ధులతో కలసి నిన్ను మహిమపరచుచుండునట్లు. ఆదినులేని తండ్రివైన నీవు, నీతో ఏకస్వరూపుడైన కుమారుడు, మరియు ప్రాణదాయకుడైన పరిశుద్ధాత్మ — ఇప్పుడు, ఎల్లప్పుడు, యుగయుగాలన్నిటిలొను. ఆమేన్.

ప్రతి గంట ముగింపున ప్రార్థించు విన్నపము

దేవా, మమ్మీద కరుణ చూపుము; ఆ తర్వాత మరల కరుణ చూపుము. పరలోకమందును భూమిమీదను ఎల్లకాలము ఆరాధింపబడి మహిమపొందుచున్న, మన క్రీస్తు దేవుడగు సద్గుణసంపన్నుడా, దీర్ఘశాంతుడా, మహాకరుణామయుడా, మిక్కిలి సానుభూతిగలవాడా, ధర్ములను ప్రేమించువాడా, పాపులను కరుణించువాడా — అందులో ముందువాడునైన నేను — నీవు దుర్మార్గుని మరణమునకును కాక, అతడు మనస్సు మార్చుకొని బ్రదుకుటకే ఇష్టపడుచున్నావు; రానున్న మేలుల వాగ్దానమునుగూర్చి అందరినీ రక్షణకు పిలిచుచున్నావు.

ప్రభువా, ఈ గడియలోను ప్రతిగడియలోను మా విన్నపములను అంగీకరించుము. మా జీవనమును సులభపరచుము; నీ ఆజ్ఞలను చేయుటకై మమ్మును దారి చూపుము. మా ఆత్మలను పరిశుద్ధపరచుము. మా దేహములను శుద్ధపరచుము. మా ఆలోచనలను నిటారుకున్నవి చేయుము. మా సంకల్పములను నిర్మలపరచుము. మా వ్యాధులను స్వస్థపరచుము, మా పాపములను క్షమించుము. ప్రతి చెడ్డ దుఃఖము నుండియు హృదయ వేదన నుండియు మమ్మును విడిపించుము. నీ పరిశుద్ధ దూతలచేత మమ్మును చుట్టుముట్టించుము, వారి శిబిరమందు మేము కాపాడబడినవారమై, దారిచూపబడినవారమై, విశ్వాస ఏకత్వమునకు, నీ అనిర్వచనీయమైన, అశేషమైన మహిమ జ్ఞానమునకు చేరు గాక; ఏనందున నీవు యుగయుగములవరకు ధన్యుడవు. ఆమేన్.

దేవా, కృతజ్ఞతతో ఇలా అనునట్లు మమ్మును యోగ్యులుగా చేయుము: పరలోకమందున్న మా తండ్రి...